నిర్మాత సురేశ్‌ బాబుకు హైకోర్టులో ఊరట | High Court relief to Producer suresh babu | Sakshi
Sakshi News home page

నిర్మాత సురేశ్‌ బాబుకు హైకోర్టులో ఊరట

Published Tue, Apr 12 2016 8:51 AM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM

నిర్మాత సురేశ్‌ బాబుకు హైకోర్టులో ఊరట - Sakshi

నిర్మాత సురేశ్‌ బాబుకు హైకోర్టులో ఊరట

సాక్షి, హైదరాబాద్: ఫిలిం చాంబర్ అధ్యక్షుడు డి.సురేశ్‌ బాబుకు హైకోర్టు ఊరటనిచ్చింది. చాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించకుండా సురేశ్‌ బాబును నియంత్రిస్తూ సిటీ సివిల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేశ్‌ బాబు ఫిలిం చాంబర్‌కు బకాయిలున్నారని, అలాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని, అయినా కూడా పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ పంపిణీదారుడు మురళీమోహన్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని విచారించిన సివిల్ కోర్టు, చాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించకుండా సురేష్‌బాబును నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అటు చాంబర్, ఇటు సురేశ్‌ బాబు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సురేష్‌బాబు ఎలాంటి బకాయిలు లేరని, నిబంధనల మేరకు ఎన్నికైన వ్యక్తిని బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుకోవడం సరికాదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య సివిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement