స్విస్ చాలెంజ్‌పై స్టే | High Court stays AP govt's Swiss challenge method for capital development | Sakshi
Sakshi News home page

స్విస్ చాలెంజ్‌పై స్టే

Published Tue, Sep 13 2016 2:07 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

స్విస్ చాలెంజ్‌పై స్టే - Sakshi

స్విస్ చాలెంజ్‌పై స్టే

  • నోటిఫికేషన్లలో తదుపరి చర్యలన్నీ నిలిపివేత
  • హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  •  ఏపీ ప్రభుత్వం, సీఆర్‌డీఏ ప్రతీ చర్యను తప్పుపట్టిన న్యాయస్థానం.. ఒక్కో తప్పును  ఎత్తిచూపి.. దానిపై సుదీర్ఘంగా చర్చించిన కోర్టు
  •  ఆదాయ వివరాల బహిర్గతం తప్పనిసరి..
  •  అది కూడా ప్రాథమిక దశలోనే వెల్లడించాలి
  •  చెప్పకపోవటం ఏపీఐడీఈ చట్టానికి విరుద్ధం
  •  వివరాలు లేకుండా పోటీ ప్రతిపాదనలు అసాధ్యం
  •  ఇక్కడంతా రివర్స్‌లో ప్రక్రియ ప్రారంభమైంది
  •  ప్రతిపాదనలు తమకే తెలియవని ప్రభుత్వం ఒప్పుకుంది
  •  అలాంటప్పుడు అవి రాష్ట్రానికి ప్రయోజనమనే నిర్ణయానికి ఎలా రాగలరు?
  •  
     సాక్షి, హైదరాబాద్: స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత నిర్మాణాన్ని చేపడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికొచ్చే ఆదాయ వివరాలను బహిర్గతం చేయకుండానే సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ కమిషనర్ గత నెల 18న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్.. ఆ నోటిఫికేషన్‌కు సవరణలు చేస్తూ గత నెల 28న జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపేసింది.

    ఆదాయ వివరాలను ప్రాథమిక దశలోనే బహిర్గతం చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. అలా బహిర్గతం చేయకపోవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఆదాయ వివరాలు ఎంత మాత్రం యాజమాన్య సమాచారం (ప్రొప్రైటరీ ఇన్ఫర్మేషన్) కిందకు రావని పేర్కొంది. ఆదాయ వివరాల సమాచారం తమ ముందు లేకపోవడంవల్ల.. పోటీ ప్రతిపాదనలు సమర్పించే విషయంలో ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులకు తగినంత సమయం లేకపోయిందని తెలిపింది.
     
    స్విస్ ఛాలెంజ్ విధాన ప్రక్రియ మొదట స్థానిక ఏజెన్సీతో మొదలై, చివరకు ప్రభుత్వం వద్దకు చేరుకుంటుందని, అయితే ఇక్కడ ‘రివర్స్’లో ప్రక్రియ ప్రారంభమైందని ఆక్షేపించింది. తమకు ఎంత ఆదాయం వస్తుందో రాష్ట్ర ప్రభుత్వానికే తెలియనప్పుడు, సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలు రాష్ట్రానికి ప్రయోజనకరమనే నిర్ధారణకు రావడం సాధ్యం కాదని పేర్కొంది. కన్సార్టియం ప్రతిపాదనలకు ‘ఆసక్తి’ ఉన్న దరఖాస్తుదారులు పోటీ ప్రతిపాదనలు సమర్పించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన గడువు చాలా స్పల్పమని అభిప్రాయపడింది. కోర్టు జోక్యంతో గడువు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన సవరణ నోటిఫికేషన్‌ను కూడా హైకోర్టు ఈ సందర్భంగా తప్పుపట్టింది.
     
    ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు మొత్తం ప్రక్రియను నిలుపుదల చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. లేనిపక్షంలో పిటిషనర్లకు, రాష్ట్రానికి, ప్రజా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు గడువు 20 సంవత్సరాలని, అందువల్ల స్టే ఇవ్వడం వల్ల ప్రాజెక్టు అమల్లో జరిగే స్వల్ప జాప్యం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదని, అంతిమంగా ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది.

    తదుపరి విచారణ అక్టోబర్ 31కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం 56 పేజీల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై ధర్మాసనం ముందుకు అప్పీలు దాఖలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. బుధవారం అప్పీలు దాఖలుకు అవకాశం ఉంది. మధ్యంతర ఉత్తర్వుల వివరాలిలా ఉన్నాయి....
     
     ప్రాథమిక దశలోనే వెల్లడించాలని ధర్మాసనమే చెప్పింది...
    భూముల కేటాయింపులు, కాంట్రాక్టుల అప్పగింత తదితర విషయాలన్నీ రాజ్యాంగానికి లోబడే జరుగుతున్నాయా? అన్న దాన్ని పరీక్షించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రభుత్వ చర్యలు సహేతుకంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిష్పాక్షికంగా, ఆరోగ్యకరమైన పోటీతో, అందరికీ సమానావకాశాలు కల్పించేలా ఉండాలని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ప్రస్తుత కేసులో ప్రభుత్వం, సీఆర్‌డీఏ అధికారులు ప్రజా ప్రయోజనాల కోసం ప్రజా ఆస్తుల ధర్మకర్తలుగా తమ బాధ్యతలను ఎలా నిర్వర్తించారో చూడాల్సింది.
     
    రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేసేందుకు స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ప్రభుత్వం చట్ట ప్రకారమే అనుసరించిందా? లేదా? అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ) యాక్ట్ 2001లోని సెక్షన్ 2 (ఎస్‌ఎస్) ప్రకారం ప్రధాన ప్రతిపాదకుడిగా సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ వివరాలను ప్రాథమిక దశలోనే బహిర్గతం చేయడం తప్పనిసరి. అయితే యాజమాన్య సమాచారమన్న కారణంతో దానిని సీల్డ్ కవర్‌లో ఉంచి పోటీ ప్రతిపాదనలు సమర్పించేందుకు ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులకు, ప్రజలకు తెలియచేయకపోవడం చట్ట విరుద్ధమే అవుతుంది.

     
    కోర్టు జోక్యంతో ప్రభుత్వం సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఆదాయ వివరాలు బహిర్గతం చేస్తామని చెప్పింది. అయితే ప్రాథమిక దశలో కాకుండా.. క్వాలిఫైడ్ బిడ్లు తెరిచిన తరువాత చెబుతామంది. ప్రతిపాదనలన్నింటినీ ప్రాథమిక దశలోనే వెల్లడించాలని ఇదే హైకోర్టు ధర్మాసనం ఐక్యాచ్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ వర్సెస్ ప్రకాశ్ ఆర్ట్స్ కేసులో తీర్పునిస్తూ స్పష్టంగా చెప్పింది. అయితే ఈ తీర్పు ఈ కేసుకు వర్తించదని అటార్నీ జనరల్ చేసిన వాదనలతో నేను ఏకీభవించడం లేదు. అటు చట్టం చూసినా, ఇటు హైకోర్టు ధర్మాసనం తీర్పును చూసినా కూడా ప్రధాన ప్రతిపాదకుడి ప్రతిపాదనలను ప్రాథమిక దశలో వెల్లడించి తీరాలి.
     
    చూడకుండానే రూ.3వేల కోట్ల ప్రాజెక్టు మొదలుపెట్టడం సరికాదు..
    అటు ప్రభుత్వం గానీ, ఏపీఐడీఈ చట్టం కింద ఏర్పాటైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ గానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపర్ కమిటీ గానీ సింగపూర్ కన్సార్టియం సీల్డ్ కవర్‌లో సమర్పించిన ఆదాయ వివరాలను చూడలేదని అటార్నీ జనరలే అంగీకరించారు. అసలు ఆదాయ వివరాలు ‘యాజమాన్య సమాచారం’ ఎంత మాత్రం కాదు. సింగపూర్ కన్సార్టియం అడిగింది కాబట్టి అది యాజమాన్య సమాచారం అవుతుందనడం ఎంత మాత్రం సరికాదు.
     
    సెక్షన్-2(ఎస్‌ఎస్) ప్రకారం బహిర్గతం చేయకపోవడానికి ఆదాయ వివరాలు ఎంత మాత్రం అతీతమైనవేవీ కావు. యాజమాన్య సమాచారం సాధారణంగా పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, కాపీ రైట్లు, డిజైన్ల వంటి మేథోపరమైన ఆస్తులకు సంబంధించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఒక కాంట్రాక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదన ఎంత మాత్రం యాజమాన్య సమాచారమే కాదు. రవి డెవలప్‌మెంట్ కేసులో సుప్రీంకోర్టు సైతం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో పారదర్శకత చాలా ముఖ్యమని గట్టిగా చెప్పింది.
     
    ఆదాయ వివరాలు యాజమాన్య సమాచారమని ప్రభుత్వం ఒకవైపు చెబుతూ, మరోవైపు ఆ వివరాలను మొదటి దశ బిడ్డింగ్‌లో అర్హత సాధించిన బిడ్డర్లకే చెబుతామనడం పరస్పర విరుద్ధంగా ఉంది. ఒక అది యాజమాన్య సమాచారమైతే దానిని పూర్తిగా రహస్యంగానే ఉంచి తీరాలి. సెక్షన్-2(ఎస్‌ఎస్) ప్రకారం కూడా దానిని బహిర్గతం చేయడానికి వీల్లేదు.

    కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ వివరాలు ప్రభుత్వానికి గానీ, సీఆర్‌డీఏ అధికారులకు గానీ తెలియకుంటే, అసలు ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట్రానికి ప్రయోజనకరమనే నిర్ణయానికి ఎలా రాగలరు? వాణిజ్యబిడ్, అందులో నిబంధనలు, ఇతర ప్రతిపాదనలు తెలుసుకోకుండానే వారు ఎలా స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అనుసరిస్తున్నారు? సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలేవీ తెలియకుండానే, రూ.3వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టు కోసం స్విస్ ఛాలెంజ్ పద్ధతిన మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం.
     
    మొత్తం ‘రివర్స్’లోనే జరిగింది.. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం...
    ఈ మొత్తం వ్యవహారంలో అధికారులు అనుసరించిన విధాన ప్రక్రియలో కూడా చాలా అవకతవకలున్నాయి. ఐపీఐడీఈ చట్టంలోని సెక్షన్-19-2 ప్రకారం మొదట ప్రధాన ప్రతిపాదకుడు తమ ప్రతిపాదనలను మొదట స్థానిక ఏజెన్సీ అయిన సీఆర్‌డీఏకు సమర్పించాలి. ఆ ప్రతిపాదనలను చూసి ప్రధాన ప్రతిపాదకుడికి ఆ ప్రాజెక్టు చేపట్టే అర్హత, సామర్థ్యం ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఆ తరువాత ఇన్‌ఫ్రాస్రక్చర్ అథారిటీ పరిశీలన చేయాలి.
     
    తరువాత ప్రభుత్వానికి సిఫారసులు వెళ్లాలి. అయితే ప్రస్తుత కేసులో మొత్తం వ్యవహారం ‘రివర్స్’లో జరిగింది. కన్సార్టియం ముందు తమ ప్రతిపాదనలను నేరుగా ప్రభుత్వానికే సమర్పించింది. తరువాత ప్రభుత్వం నుంచి హైపర్ కమిటీకి వెళ్లాయి. (హైపర్ కమిటీ ఏర్పాటును చట్టం చెప్పలేదు). ఆ తరువాత సీఆర్‌డీఏకు... అక్కడి నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి చేరి, మళ్లీ అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్లాయి. ఈ రివర్స్ విధానం జరిగిన విషయాన్ని అటార్నీ జనరల్ సైతం అంగీకరించారు. ఈ రివర్స్ విధానం వల్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ స్వతంత్రత ప్రభావితమైంది.
     
     ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినప్పుడు, దానికి విరుద్ధంగా వెళ్లేందుకు సీఆర్‌డీఏ, ఇన్‌ఫ్రా అథారిటీ వంటి అధికార సంస్థలు ఇబ్బంది పడుతాయి.
    పాలనలో ఇది ప్రత్యక్ష అనుభవమే. ఈ మొత్తం వ్యవహారంలో ఇన్‌ఫ్రా అథారిటీ స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంది. అయితే వాస్తవానికి అలా జరగనే లేదు. ఈ రివర్స్ విధానం వల్ల నష్టం లేదని, అంతిమంగా మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రభుత్వమే చెబుతుందన్న అటార్నీ జనరల్ వాదనలతో ప్రాథమిక ఆధారాలను బట్టి ఏకీభవించలేకపోతున్నా. ప్రతిపాదనలను మొదట ప్రభుత్వానికి సమర్పించాలని చట్టం ఎక్కడా చెప్పడం లేదు. దీనిని బట్టి ఈ మొత్తం వ్యవహారంలో చట్ట ప్రకారం అనుసరించాల్సిన ప్రక్రియ నుంచి పక్కకు వెళ్లినట్లు స్పష్టమవుతోంది.
     
    విదేశీ అనుభవం వివక్షాపూరితం...
     పక్షపాతాన్ని, ఏకపక్ష విధానాలను నిరోధించేందుకు విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విధానాలను న్యాయపరంగా సమీక్షించవచ్చునని టాటా సెల్యూలర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ అధికారులు జారీ చేసిన పత్రికా ప్రకటనలో చట్టానికి లోబడే పనిచేస్తామని పేర్కొన్నారు. వాస్తవానికి పోటీ ప్రతిపాదనల నోటిఫికేషన్, తదానుగుణ సవరణ నోటిఫికేషన్ జారీనే చట్ట విరుద్ధంగా జరిగింది. ఇది విధానపరమైన అవకతవకే అవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అనుసరించిన విధానాన్ని చూస్తే ఏ అధికారి కూడా సహేతుకంగా, నిష్పాక్షికంగా చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరించలేదు.
     
     తక్కువ వ్యయంతో కూడుకున్న ‘రాజీ’ నిబంధనలను పక్కనపెట్టి, వ్యయంతో కూడిన లండన్‌లోనే కూర్చొనే చేసే మధ్యవర్తిత్వ క్లాజ్‌ను ప్రభుత్వం ఆమోదించింది. ఇక పోటీ ప్రతిపాదనల నోటిఫికేషన్‌లో నిర్దేశించిన అర్హతల విషయానికొస్తే, ‘భారతదేశం వెలుపల అనుభవం’ అన్న నిబంధన పక్షపాతంతో కూడుకున్నది.
    ఈ ప్రాజెక్టు విస్తృతిని దృష్టిలో పెట్టుకుని, సాంకేతికంగా, ఆర్థికంగా సింగపూర్ కన్సార్టియంతో సరితూగే లేదా వారికన్నా ఎక్కువ అర్హతలున్న వారికే పనులు అప్పగించాలన్న ఉద్దేశంతోనే ఈ అర్హతలు నిర్దేశించినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వాదన ఎంత మాత్రం సహేతుకంగా లేదు. భారతదేశం వెలుపల అన్న ప్రభుత్వం, అభివృద్ధి చెందిన దేశాల్లోనే కార్యకలాపాలు నిర్వహించి ఉండాలని ఆ షరతుల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. ఒకవేళ అలా చెప్పి ఉంటే అది సమర్థనీయమయ్యేదే.
     
    పిటిషనర్లకు జోక్యం చేసుకునే అర్హత ఉంది...
    పిటిషనర్లకు ఈ మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకునే అర్హత లేదన్న ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేకపోతున్నా. ఇందుకు ఓ ఉదాహరణనిస్తున్నా. ఓ ఉద్యోగ భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే భారతదేశం వెలుపల డిగ్రీ సాధించి ఉండాలన్న నిబంధన పెట్టింది. ఈ నిబంధనను ఆ అభ్యర్థి సవాలు చేశారు. ఆ నిబంధనను సంతృప్తిపరచడం లేదన్న కారణంతో ఆ వ్యక్తి ఆ నిబంధనను సవాలు చేయడానికి వీల్లేదని చెప్పగలమా? చెప్పలేం. అర్హత నిబంధనలపై ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం వేరు... అర్హత సాధించిన తరువాత ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం వేరు.
     
     తన న్యాయపరమైన హక్కులకు విఘాతం కలుగుతుందని భావించిన ఏ వ్యక్తయినా కూడా కోర్టులను ఆశ్రయించవచ్చు. అలాగే ఈ కేసులో తన హక్కులకు భంగం కలుగుతుందని పిటిషనర్లు భావించారు కాబట్టే కోర్టుకు వచ్చారు. తుది విచారణలో అర్హతలు, నిబంధనల చట్టబద్ధత తేలుతుంది. ఈ కేసులో ప్రభుత్వం, సీఆర్‌డీఏ వాదనలు ఎలా ఉందంటే ‘ఆసక్తి’ ఉన్న దరఖాస్తుదారులు అంటే.. బిడ్డింగ్‌కు అర్హత ఉన్నవారు.. అన్న అర్థంలో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు అంటే అర్హత లేని వారు అని కాదు. ఆసక్తి ఉన్న వ్యక్తి అర్హత లేకపోయినా బిడ్ దాఖలు చేయవచ్చు. బిడ్ దాఖలు చేసిన తరువాత అర్హత ఉందా? లేదా? తేలుతుంది. కాబట్టి వారికి కోర్టును ఆశ్రయించే అర్హత, ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత లేదనడం సరికాదు.
     
     లోపాలను సరిదిద్దుకునేందుకే కోర్టు జోక్యం...
     ఈ కేసులో రాజధాని నిర్మాణానికి విరుద్ధంగా ఏవైనా మధ్యంతర ఉత్తర్వులిస్తే దాని ప్రభావం దారుణంగా ఉంటుందని అటార్నీ జనరల్ చెప్పారు. ఉత్తర్వులిచ్చే ముందు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. అయితే ఈ అంశాల విషయంలో కోర్టు స్పృహలోనే ఉంది. అసాధారణ కేసుల్లో విధానపరమైన అవకతవకలు, ఏకపక్ష నిర్ణయాలు ఉన్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చునని టాటా సెల్యూలార్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అభివృద్ధి కార్యాక్రమాల ప్రక్రియను న్యాయస్థానాలను సాధారణంగా నిలుపుదల చేయబోవని, అయితే స్విస్ ఛాలెంజ్ పద్ధతి విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధాన ప్రక్రియలో లోపాలు ఉన్నందున వాటిని ఆదిలోనే సరిదిద్దుకునే అవకాశం ఇచ్చేందుకు వీలుగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సవరణ నోటిఫికేషన్ ప్రకారం బిడ్‌ల సమర్పణకు తుది గడువు సెప్టెంబర్ 13 చివరి తేదీ. ఆదాయ వివరాలు లేకుండా పోటీ ప్రతిపాదనలు సమర్పించే అవకాశం లేకపోవడంతో టెండర్ నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్‌లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తున్నా... అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
     
    బహిర్గతం చేయకపోతే.. ‘ఛాలెంజ్’ ఎలా చేస్తారు..?
    ఒకరు చేసిన సవాలుకు మరొకరు స్పందించేందుకు వీలు కల్పిస్తున్నందువల్లే దీనిని ‘ఛాలెంజ్’ అన్నారు. ఇక్కడ సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలను ప్రాథమిక దశలో బహిర్గతం చేయకపోతే ఆ ప్రతిపాదనలను ఆసక్తి ఉన్న దరఖాస్తుదారులు ఎలా ‘ఛాలెంజ్’ చేయగలుగుతారు? ప్రతిపాదనలు బహిర్గతం కానప్పుడు పోటీ ప్రతిపాదనలు సమర్పించేందుకు ఎవరైనా కూడా ఎందుకు ఉత్సాహం చూపుతారు? దీనివల్ల స్విస్ ఛాలెంజ్ లక్ష్యం ఎలా నెరవేరుతుంది? సెక్షన్-2(ఎస్‌ఎస్) ప్రకారమే స్విస్ ఛాలెంజ్ విధానం అమలు కావాలంటే ఆదాయ వివరాలను ప్రాథమిక దశలోనే బహిర్గతం చేసి తీరాలి. సెక్షన్-2 (ఎస్‌ఎస్) ప్రకారం స్విస్ ఛాలెంజ్ లేకపోతే అది సీల్డ్ టెండర్ ప్రక్రియే అవుతుంది. అందువల్ల ఐక్యాచ్ కేసులో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును నేను, చట్ట నిబంధనలను ప్రభుత్వం అమలు చేయాల్సిందే.
     
     
     గుర్రానికి ముందు బండి ఉంచారు...
    ప్రధాన ప్రతిపాదకుడి వాణిజ్య బిడ్‌ను తెరిచినప్పుడు అందులో ప్రతిపాదనలు ప్రభుత్వ ప్రయోజనాలకు అనుకూలంగా లేకపోతే ఆ ప్రతిపాదనలను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని అటార్నీ జనరల్ చెప్పారు. అయితే వాస్తవానికి ఇది కరెక్ట్ కాదు. చట్ట నిబంధనల ప్రకారం రాష్ట్రానికి వచ్చే వాణిజ్యపరమైన ప్రయోజనాలను అధికారులు ముందు చూడాలి. ఆ తరువాతే స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అనుసరించాలి. కాని అధికారులు అందుకు విరుద్ధమైన విధానాన్ని అనుసరించారు. మొదట స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అనుసరించి, ఆ తరువాత వాణిజ్యబిడ్‌లను పరిశీలిస్తామంటున్నారు. ఇది ‘గుర్రానికి ముందు బండి ఉంచడమే’. ఇది విధానపరమైన అవకతవకే కాక, ప్రజా ప్రయోజనాలను ప్రమాదంలో నెట్టి వేయడమే అవుతుంది. ఒక ప్రక్రియను నిర్దిష్ట విధానంలోనే చేయాలని చట్టం చెబుతుంటే అధికారులు ఆ ప్రక్రియను ఆ విధానంలోనే చేయాలి. ప్రభుత్వం, అధికారాలు ఓ చట్టం కింద పనిచేస్తుంటే, వారు ఆ చట్టం సృష్టించిన జీవులు మాత్రమే. వారు ఆ చట్టం నాలుగు గోడల మధ్యే పని చేయాల్సి ఉంటుంది.
     
     
     నోటిఫికేషన్లపై పిటిషన్లు...
    6.84 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్‌కు చెందిన అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్-సెంబ్‌కార్ప్ సంస్థల కన్సార్టియం ప్రధాన ప్రతిపాదకుడిగా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ కమిషనర్ గత నెల 18న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు జోక్యంతో తరువాత గడువు తేదీని పెంచడంతోపాటు బిడ్‌ల ప్రక్రియను రెండుగా విభజిస్తూ గత నెల 28న ప్రభుత్వం సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, చెన్నైకి చెందిన ఎన్వియన్ ఇంజనీర్స్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలపై పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు డి.ప్రకాశ్‌రెడ్డి, వేదుల వెంకటరమణ... సీఆర్‌డీఏ, పురపాలకశాఖల తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ల వాదనలు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విన్నారు. అనంతరం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన న్యాయమూర్తి సోమవారం ఉదయం తన నిర్ణయాన్ని వెలువరించారు.
     
     మూడు ప్రశ్నలు లేవనెత్తిన న్యాయమూర్తి...
     న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో ప్రధానంగా మూడు ప్రశ్నలు లేవనెత్తారు. ఒక్కో ప్రశ్నకు సవివరంగా సమాధానమిచ్చారు.
     1. పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ కమిషనర్ గత నెల 17న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్, 28న జారీ చేసిన సవరణ నోటిఫికేషన్‌లలో జోక్యం చేసుకునే పరిధి పిటిషనర్లకు ఉందా?
     2. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు వీలుగా పిటిషనర్లు ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందు ఉంచగలిగారా?
     3. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోతే ప్రజా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement