అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్
ఉభయ రాష్ట్రాల వివరణ కోరిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకాన్ని (బీపీఎస్‌ను) అడ్డంపెట్టుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయని, వీటిపై చర్యలు తీసుకోకపోవడంపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం సీరియస్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందులో భాగంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాల పురపాలకశాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, సీఆర్‌డీఏ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బీపీఎస్ పథకాన్ని అడ్డంపెట్టుకుని పలువురు వ్యక్తులు, బిల్డర్లు ఉభయ రాష్ట్రాల రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, వీటిపై ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి. స్పందించిన హైకోర్టు వాటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులుగా ఉన్న ఉభయ రాష్ట్రాల పురపాలకశాఖ అధికారులకు, కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.