అనుమతి రెండంతస్తులకు.. నిర్మాణం 6 అంతస్తులా..!
- ఇంత దారుణం జరుగుతుంటే ఏం చేస్తున్నారు..?
- జీహెచ్‌ఎంసీ అధికారులపై హైకోర్టు మండిపాటు
సాక్షి, హైదరాబాద్: రెండు అంతస్తుల నిర్మాణానికి అనుమతులు తీసుకున్న ఓ వ్యక్తి, అనుమతులకు విరుద్ధంగా మరో నాలుగు అంతస్తులను అక్రమంగా నిర్మిస్తుంటే ఏం చేస్తున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా సదరు వ్యక్తి నాలుగు అదనపు అంతస్తుల నిర్మాణాన్ని పూర్తి చేస్తే, అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉందని మండిపడింది.
గత ఒకటిన్నర సంవత్సరంగా ఆ వ్యక్తి అక్రమ నిర్మాణం చేస్తుంటే ఏ అధికారికి పట్టినట్లు కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాలను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో స్వయంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, ఫీల్‌ఖానాకు చెందిన పురుషోత్తం వ్యాస్ అనే వ్యక్తి 186.74 గజాల స్థలంలో రెండు అంతస్తుల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు పొందారు. అయితే రెండు అంతస్తులకు అదనంగా మరో నాలుగు అంతస్తులు నిర్మించడం మొదలు పెట్టారు. దీనిపై స్థానికంగా ఉండే బాల్ ముకుంద్ మిశ్రా అనే వ్యక్తి జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు అంతస్తులకు అనుమతులు తీసుకున్న వ్యక్తి, మొత్తం ఆరు అంతస్తులు నిర్మిస్తున్నారని తెలుసుకున్న జడ్జి విస్తుపోయారు. అక్రమ కట్టడాలపై జీహెచ్‌ఎంసీ చూపుతున్న అలసత్వంపై వివరణ ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు. వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని స్పష్టంచేశారు.