- అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను నిలదీసిన హైకోర్టు
- వివరాలతో అఫిడవిట్ దాఖలుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : అక్రమ నిర్మాణాలను మొగ్గలోనే తుంచి వేసేం దుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కమిషనర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ‘అక్రమ నిర్మాణం గురించి ఫిర్యాదు వచ్చేంత వరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఎందుకు ఎదురుచూస్తున్నారో అర్థం కావడం లేదు. వాటిని ఆదిలోనే నిరోధించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
క్షేత్రస్థాయి అధికారు లు బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లు లేదు. అందుకే అక్రమ నిర్మాణాలైపై హైకోర్టులో భారీగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. బాధితు లు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసిన తరువాతే అధికారులు ఉల్లంఘనులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న వెంటనే వారు సివిల్ కోర్టుకెళ్లి ఆ నోటీసులపై ఇంజక్షన్ ఉత్తర్వులు పొందుతున్నారు. అక్రమ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఆలస్యమైనప్పటికీ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడానికి తగు సమయం ఆసన్నమైంది’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమ పొరుగువారు అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని, దానిపై ఫిర్యాదులు చేసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని హైదరాబాద్‌కు చెందిన జాన్ మహమ్మద్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి గత వారం విచారించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ తరఫు న్యాయవాది ఎన్.అశోక్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ ఫిర్యాదు ఆధారంగా అక్రమ నిర్మాణం చేపడుతున్న మన్సూర్ దబానీ, జగదీశ్ షాలకు నోటీసులు జారీ చేశామన్నారు. ఈ నోటీసులపై వారు సివిల్ కోర్టులను ఆశ్రయించి, ఇంజంక్షన్ ఉత్తర్వులు పొందారని కోర్టుకు నివేదించారు. వాదనల విన్న న్యాయమూర్తి పై ఉత్తర్వులు జారీ చేశారు.