
తుది ఘట్టానికి ‘దానం’ హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ పొలిటికల్ హైడ్రామా క్లైమాక్స్‌కు చేరింది. అంతా సవ్యంగా సాగితే సోమవారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌లో చేరదామని ఆదివారం ఉదయం పార్టీ శ్రేణులకు సంకేతాలిచ్చిన ఆయన... మధ్యాహ్నానికల్లా మనసు మార్చుకున్నట్టు చెబుతున్నారు. ‘మనమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగుదాం’ అని వారికి చెప్పినట్లు సమాచారం. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గ శ్రేణులు పూర్తి అయోమయానికి గురయ్యాయి.
దానం టీఆర్‌ఎస్‌లో చేరే సందర్భంలో తాను ఆహ్వానించి కండువా కప్పలేనని, ఒక వేళ నగర మంత్రులు, ఇతర ముఖ్యనాయకుల సమక్షంలో ఆయన చేరితే అభ్యంతరం లేదని టీఆర్‌ఎస్ అగ్రనేత స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో దానం మనసు మార్చుకున్నట్లు సమాచారం. తాను అగ్రనేత సమక్షంలో అయితేనే పార్టీలోకి వస్తానని, ఇతరులైతే రాలేనని... దానం సైతం మధ్యవర్తులకు తేల్చిచెప్పారు. ఇదే విషయాన్ని పార్టీలోని ఒకరిద్దరు సన్నిహితులతోనూ ఆయన చర్చించి, తానిక కాంగ్రెస్‌లోనే కొనసాగుతానంటూ స్పష్టం చేసినట్టు తెలిసింది. సోమవారం సాయంత్రానికి దానం ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఊహాగానాలకు తెరదించే అవకాశం కనిపిస్తోంది.