హైటెక్ బెట్టింగ్స్! | High-tech bettings! | Sakshi
Sakshi News home page

హైటెక్ బెట్టింగ్స్!

Published Thu, Jan 7 2016 11:39 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

హైటెక్ బెట్టింగ్స్! - Sakshi

హైటెక్ బెట్టింగ్స్!

మూసధోరణి వీడిన వ్యవస్థీకృత ముఠాలు
హాట్‌లైన్ బాక్సులు, రికార్డర్లతో వ్యవహారం
మూడు రోజుల్లో పట్టుబడిన రెండు గ్యాంగ్స్

 
సిటీబ్యూరో: భారత్‌లో జరిగే లేదా భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలోనే బెట్టింగ్ నిర్వహించడం... టీవీ, పంటర్ల వివరాలు రాసుకోవడానికి రికార్డులు, ఫోన్లు... ఒకప్పుడు బెట్టింగ్స్ నిర్వహించే ముఠాల వ్యవహార శైలి ఇది. 365 రోజులూ పని చేసే డెన్లు... ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా పందాలు స్వీకరించడం.... ల్యాప్‌టాప్‌లు, హాట్‌లైన్ బాక్సులు, వాయిస్ రికార్డర్లు... ఇదీ నేటి బెట్టింగ్ రాయుళ్ల హైటెక్ పంథా.

పోలీసు విభాగమే కాదు... అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ముఠాలు సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. ‘సమకాలీన’ అవసరాలకు తగ్గట్టు మార్పుచేర్పులు సంతరించుకుంటున్నాయి. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు రోజుల వ్యవధిలో అరెస్టు చేసిన రెండు బెట్టింగ్స్ గ్యాంగ్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండు ముఠాలూ భారత్‌తో ఎలాంటి సంబంధం లేని, ఆస్ట్రేలియాలో జరుగుతున్న అక్కడి దేశవాళీ మ్యాచ్‌లకు పందాలు నిర్వహిస్తూ చిక్కినవే.
 
ముఖేష్‌శర్మ... ‘హాట్ హాట్ హాట్’
చార్మినార్‌లోని చిల్లాపురకు చెందిన ముఖేష్‌శర్మ నేతృత్వంలో సాగుతున్న ఈ ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా ‘ఇదే వృత్తి’లో కొనసాగుతున్న ఇతగాడు మరో ఐదుగురితో కలిసి ముఠా ఏర్పాటు చేసి బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. దీనికోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన మనోజ్ నుంచి మూడు హాట్‌లైన్ బాక్సులు సమీకరించుకున్నాడు. ఒక్కో బాక్సులో గరిష్టంగా 10 సెల్‌ఫోన్ల అనుసంధానించే అవకాశం ఉంది. ఆ ఫోన్లలో కేవలం పంటర్లతో మాట్లాడటానికి వినియోగించే సిమ్‌కార్డుల్ని మాత్రమే వేస్తారు. ఆ పది మందీ ఒకేసారి ఫోన్ చేసి మాట్లాడాలని ప్రయత్నించినా... అవన్నీ హాట్‌లైన్ బాక్సులో రికార్డు అయిపోతాయి. ఎంత పందెం కాశారు? ఏ జట్టు వైపు కాశారు? అనేవి తెలుసుకోవడానికి, ఆట ముగిశాక లావాదేవీల ఆధారంగానూ ఆ రికార్డింగ్స్ ఉపకరిస్తాయని నిందితులు వెల్లడించారు.
 
కుల్‌దీప్‌సింగ్ ‘రికార్డ్’...
 మంగళ్‌హాట్‌కు చెందిన కుల్‌దీప్‌సింగ్ నేతృత్వంలో మరో నలుగురితో ఏర్పాటైన గ్యాంగ్‌ను బుధవారం పట్టుకున్నారు. వీరి నుంచి టీవీ, సెట్‌టాప్ బాక్సులు తదితరాలతో పాటు ప్రముఖ కంపెనీకి చెందిన ఓ వాయిస్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాత, కొత్త పంటర్ల నుంచి పందాలు అంగీకరిస్తున్న ఈ గ్యాంగ్ వారి నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేయడానికి దీన్ని వినియోగిస్తోంది. ఈ వాయిస్ రికార్డర్‌ను కేవలం ఒక ఫోన్‌కు మాత్రమే కనెక్ట్ చేసే అవకాశం ఉంది. దాని ద్వారానే ఈ ముఠా.. పంటర్లకు కాల్ చేస్తూ, వారి నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకుంటూ ఆధారాలు భద్రపరుచుకోవడం ప్రారంభించిందని టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు. బంజారాహిల్స్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్న కుల్‌దీప్... వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ‘అదనపు ఆదాయం’ కోసం వ్యవస్థీకృత బెట్టింగ్ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు.
 
ల్యాప్‌టాప్స్, ఏజెంట్స్ సైతం...
 ఈ రెండు ముఠాలకూ మరో ప్రత్యేకత ఉంది. ముఖేష్ గ్యాంగ్ పంటర్ల (పందాలు కాసే వ్యక్తులు) జాబితాను భద్రపరచడానికి, లావాదేవీలు చేయడానికి ల్యాప్‌టాప్స్ వినియోగిస్తోంది. ఆట ముగిసిన తర్వాత నగదు వసూలు, చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఏజెంట్లను సైతం ఏర్పాటు చేసుకుంది. కుల్‌దీప్ ముఠా ఈ కోణంలో మూసధోరణిలోనే ఉండి ఇంకా స్లిప్పులు, పుస్తకాలు నిర్వహిస్తుండగా... పంటర్లను గుర్తించడానికి మాత్రం ఏజెంట్లను పెట్టకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement