సాక్షి, హైదరాబాద్: మండుతున్న ఎండలతో ఆంధ్రప్రదేశ్ అగ్ని గుండాన్ని తలపించింది. ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పుల తీవ్రత కూడా పెరుగుతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఆదివారం తిరుపతిలో 45.7 డిగ్రీల సెల్సియస్‌తో కొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది వేసవిలో ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే వడదెబ్బ మరణాల సంఖ్య 500 దాటిపోయిందని అనధికార వర్గాల అంచనా. అయినా ప్రభుత్వం వడదెబ్బ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు తీసుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. చలివేంద్రాల ఏర్పాటు చేసి మజ్జిగ అందించేందుకు జిల్లాకు మూడు కోట్లు చొప్పున 36 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని మంత్రివర్గం ప్రకటించి వారం రోజులైనా ఇప్పటికీ నిధులు విడుదల చేయకపోడం పట్ల జిల్లాల్లో అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక మరింత సెగలు..
వచ్చే మూడు రోజులు కోస్తా లోని తొమ్మిది జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం రాత్రి వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ప్రముఖ వేసవి విడిది కేంద్రం, ఆంధ్రా ఊటీగా పేరొందిన చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ నిప్పుల కుంపటిలామారింది. సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉండే ఈ కొండపై ఆదివారం ఉష్ణోగ్రత 37 డిగ్రీలకు చేరుకోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వడదెబ్బకు 68 మంది మృతి
భానుడి ప్రతాపంతో వడదెబ్బ బారిన పడి వివిధ జిల్లాల్లో ఆదివారం 68మంది మృత్యువాత పడ్డారు. ప్రకాశం,శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో 13 మంది చొప్పున, చిత్తూరు జిల్లాలో 11 మంది, విశాఖ జిల్లాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ఐదుగురు, వైఎస్సార్ జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు.
అగ్నిగుండంగా ఏపీ
Published Mon, Apr 25 2016 5:18 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM
Advertisement