హైదరాబాద్ : ఓయూ నుంచి ఛలో అసెంబ్లీకి ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాటతోపాటు వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
వీసీ అనుమతి లేకుండా ఓయూ క్యాంపస్లోకి భారీగా పోలీసులు ప్రవేశించారు. యూనివర్శిటీ అంతటా పోలీసులు మోహరించారు. ఓయూ లెక్చరర్లు క్వార్టర్స్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గత అర్థరాత్రి మానేరు హాస్టల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
వరంగల్ ఎన్కౌంటర్ నేపథ్యంలో సెప్టెంబర్ 30న ప్రజా సంఘాలు ఛలో అసెంబ్లీకి పిలుపు నిచ్చాయి. అయితే ఈ కార్యక్రమానికి కేసీఆర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయినా తాము ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని ప్రజా సంఘాల నేతలు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని వామపక్ష నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు పోలీసులు అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.