కోర్టు లిక్విడేటర్‌నే బురిడీ కొట్టించిన వైనం
మల్కాజిగిరి ఎస్‌బీహెచ్ నుంచి తొమ్మిది కోట్లు గల్లంతు
అన్నోజిగూడలోనూ రూ.18 కోట్ల మోసం
ఇతర ప్రభుత్వ ఖాతాల డబ్బులపై పోలీసుల ఆరా
సిటీబ్యూరో/మల్కాజిగిరి : బ్యాంకుల్లో ఉన్న ప్రభుత్వ విభాగాలకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై మాయగాళ్లు కన్నేశారు. గతంలో ఇంటర్మీడియట్ బోర్డుకు చెందిన రూ. మూడు కోట్ల ఫిక్స్‌డ్ డబ్బులను కాజేసిన తరహలోనే తాజాగా మల్కాజిగిరిలోని ఎస్‌బీహెచ్‌లో ఖాయిలాపడ్డ పరిశ్రమలకు సంబంధించిన దాదాపు రూ.తొమ్మిది కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను తన్నుకుపోయారు. వివరాల్లోకి వెళితే.. ఖాయిలాపడ్డ పరిశ్రమలకు సంబంధించిన ఓ కేసుపై హైకోర్టులో విచారణ జరుగుతుండంతో కోర్టు ఆదేశాల ప్రకారం కోర్టు లిక్విడేటర్ ఇందుకు సంబందించిన లావాదేవీలు చూస్తున్నాడు. ఇదిలా ఉండగా నగరంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో సదరు శాఖకు సంబంధించిన దాదాపు రూ.తొమ్మిది కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్యాంక్ మాజీ ఉద్యోగి రమణ కోర్టు లిక్విడేటర్‌ను కలిసి, మల్కాజిగిరిలోని ఎస్‌బీహెచ్ బ్యాంక్‌లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని నమ్మించాడు.
ఆ తర్వాత రమణ మల్కాజిగిరి ఎస్‌బీహెచ్ బ్యాంక్ మేనేజర్ వద్దకు వెళ్లి ఫలానా వ్యక్తిని కలిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులు వస్తాయని చెప్పాడు. దీంతో ఆ తర్వాత రమణ కోర్టు లిక్విడేటర్‌ను కలవడంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్ పేపర్లు ఇచ్చాడు. వాటిని తీసుకొని బ్యాంక్ మేనేజర్‌కు ఇవ్వగా ఖాతాలో డిపాజిట్ చేశారు. అందుకు అతను ఇచ్చిన రసీదులను కలర్ జిరాక్స్ తీయించి, నకిలీవి కోర్టు లిక్విడేటర్‌కు ఇచ్చి అసలువి తన దగ్గరే ఉంచుకున్నాడు. పది రోజుల తర్వాత మల్కాజిగిరి ఎస్‌బీహెచ్ బ్రాంచ్ మేనేజర్‌ను కలిసి డబ్బులను ఇతర బ్రాంచ్‌లకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకున్నట్లు చెప్పి ఖాతాదారుల తరఫున లెటర్ రాసి ఇచ్చాడు. దీంతో మేనేజర్ రమణ సూచించినట్లుగానే బాంబే, రాజ్‌కోట్, చెన్నై తదితర నగరాల్లోని బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు.
ఇలా వెలుగులోకి వచ్చింది...
ఇదిలా ఉండగా ఖమ్మంలో ప్రభుత్వ విభాగానికి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయంలో మోసం జరిగిందని బయటపడటంతో అనుమానం వచ్చిన కోర్టు లిక్విడేటర్ మల్కాజిగిరి ఎస్‌బీహెచ్ బ్యాంక్ అధికారులకు ఫోన్ చెయ్యగా ఇప్పటికే ఆ డబ్బులను ఇతర ఖాతాలకు మళ్లించినట్లు తెలిపారు. దీంతో అతను మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించడంతో సూత్రధారి రమణను అదుపులోకి తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.
అన్నోజిగూడలోనూ...
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే అన్నోజిగూడ సింగపూర్ టౌన్‌షిప్ ఎస్‌బీహెచ్ బ్యాంక్‌లో రూ. 18 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇతర ఖాతాలకు మళ్లినట్లు తెలిసింది. ఈ నిధులు ఆంధ్రప్రదేశ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందినవిగా గుర్తించారు. ఇవేకాక ఇతర బ్యాంక్‌ల్లోనూ ప్రభుత్వ విభాగాల ఫిక్స్‌డ్ ఖాతాలు తరలించి ఉంటారని భావిస్తున్న పోలీసులు కేసును సీఐడీకి అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
‘ఫిక్స్’ చేసేశారు
Published Wed, Dec 2 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM
Advertisement