ముంబై: ధరల పెరుగుదల స్పీడ్ (ద్రవ్యోల్బణాన్ని) పరిగణనలోకి తీసుకుంటే రిటైల్ డిపాజిటర్లకు తమ డిపాజిట్లపై ప్రస్తుతం నెగటివ్ రిటర్న్స్ అందుతున్నాయని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆర్థికవేత్తల నివేదిక ఒకటి పేర్కొంది. ఈ నేపథ్యంలో వడ్డీ ఆర్జనలపై పన్ను అంశాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని తన తాజా నివేదికలో సూచించింది. ఈ మేరకు సౌమ్య కాంతి ఘోష్ నేతృత్వంలోని ఆర్థికవేత్తలు సమర్పించిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
►డిపాజిటర్ల అందరి గురించీ ఆలోచించక పోయినా, కనీసం సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై పన్ను భారాన్ని తగ్గించే అంశాన్ని అయినా సమీక్షించాలి. వారి రోజూవారీ అవసరాలు, వ్యయాలు ఈ వడ్డీపైనే ఆధారపడే సంగతి తెలిసిందే. మొత్తం డిపాజిట్లు దాదాపు రూ. 156 లక్షల కోట్లు. ఇందులో రిటైల్ డిపాజిట్ల వాటా దాదాపు రూ.102 లక్షల కోట్లు.
►ప్రస్తుతం,డిపాజిటర్లందరికీ సంవత్సరానికి రూ.40,000 కంటే ఎక్కువ వడ్డీ ఆదాయాన్ని జమ చేసే సమయంలో బ్యాంకులు మూలం వద్ద పన్నును మినహాయించుకుంటాయి, అయితే సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి ఆదాయం రూ .50,000 దాటితే పన్ను భారం పడుతుంది.
►వృద్ధే ప్రధాన లక్ష్యంగా దేశం ప్రస్తుతం సరళతర వడ్డీరేట్ల విధానాన్ని అవలంభిస్తోంది. దీనితో డిపాజిట్ రేట్ల కనీస స్థాయికి పడిపోయి, కేవలం దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నవారికి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. రెపో వరుసగా ఏడు త్రైమాసికాల నుంచి 4 శాతంగా కొనసాగుతోంది.
►వడ్డీరేట్లు ఇప్పట్లో పెరిగే అవకాశాలు కనిపించడంలేదు. బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) భారీగా కొనసాగుతుండడం ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సిన అంశం.
►ప్రస్తుతం ఫైనాన్షియల్ మార్కెట్‌లో బుల్‌రన్ నడుస్తోంది. ఇది డిపాజిటర్ల ఆలోచనా ధోరణిని మార్చే అవకాశం ఉంది. తమ పెట్టుబడికి తగిన రిటర్న్స్ సంపాదించడానికి వారు మార్కెట్‌వైపు చూసే అవకాశాలు ఉన్నాయి.
►వ్యవస్థలో అధిక ద్రవ్య లభ్యత, వడ్డీరేట్ల విషయంలో పోటీతత్వం, నిధుల సమీకరణ వ్యయాల సమతౌల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, బ్యాంకులు ప్రస్తుతం మార్జిన్ల ఒత్తిడులను ఎదుర్కొంటున్నాయి.
SBI: రిటైల్ డిపాజిట్లపై నెగటివ్ రిటర్న్స్!
Published Wed, Sep 22 2021 8:27 AM | Last Updated on Wed, Sep 22 2021 8:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment