వర్ణాలెన్నో సంబరాలన్ని | holly special | Sakshi
Sakshi News home page

వర్ణాలెన్నో సంబరాలన్ని

Published Wed, Mar 23 2016 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

వర్ణాలెన్నో సంబరాలన్ని

వర్ణాలెన్నో సంబరాలన్ని

 విభిన్న సంప్రదాయాలకు నిలయమైన భాగ్యనగరిలో హోలీ పండుగను ఆనందించడంలో గల్లీకొక వైవిధ్యం కనిపిస్తుంది. ఒకరికొకరు రంగులు పూసుకోవడమే కాదు.. అచ్చమైన పండుగ సందడితో పాటు దానికి తోడయ్యే ఆధునిక సొబగులూ నగరంలో  జరిగే హోలీ సంబరాల ప్రత్యేకం. మార్వాడీ శ్వేతవర్ణం.. బెంగాలీ డోల్‌యాత్ర.. మణిపూర్ గులాల్ రంగులు.. పేజ్‌త్రీ కలర్‌ఫుల్ ఆటలు.. ఎన్నో వర్ణాలు.. ఇంకెన్నో సంబరాలు.. భాగ్యనగరి సొంతం.     - సాక్షి, సిటీబ్యూరో
 
విలేజీ క్రేజీ..
హోలీ సంబరాల్లో మగవాళ్లు తలకి బంధిని పగిడి చుట్టుకొని, రంగుల ధోవతి కట్టుకుంటే.. ఆడవాళ్లు మిరిమిట్లు గొలిపే అద్దాల లంగా జాకెట్ వేసుకొని విలేజీ గెటప్‌లో అందంగా తయారవుతారు. పనికిరాని వస్తువులు, చెక్క ముక్కలను ఇంటి ముందు కుప్పగా వేసి నిప్పంటించి దాని చుట్టూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తారు. ఆ నిప్పు ఆరిపోయే వరకూ ఆడుతూ.. పాడుతూ.. ఆరిపోయే సమయంలో కల్లు తాగి గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తారు. తెలిసిన వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లి హోలీ పాటలు పాడుతూ, వారి వంశాన్ని పొగుడుతూ.. వాళ్లిచ్చే కానుకలు స్వీకరిస్తారు.
 
బెంగాలీ రూటే సెపరేట్...
హోలీ సంబరాల్లో బెంగాలీల రూటే వేరు. వీరు హోలీ సందర్భంగా ‘డోల్ యాత్ర’ నిర్వహిస్తారు. పండుగ రోజు సంప్రదాయంగా రాధాకృష్ణుడి ప్రతిమలను ఊయలలో కూర్చోబెట్టి ఊపుతూ, భక్తి పాటలు పాడుతూ నాట్యం చేస్తారు. ఒడిశా వాసులైతే రాధాకృష్ణుల బొమ్మలు ఉండే ప్లేస్‌లో జగన్నాథస్వామి బొమ్మని పెడతారు. ఇక హర్యానావాసులు హోలీ జరుపుకునే తీరులో ఎన్నో సరదాలు. హోలీ సంప్రదాయం ప్రకారం హర్యానా మహిళ తన బావ లేదా బావమరుదులతో సరదాగా ఆట ఆడుతుంది. తన చీర కొంగును ఒక తాడులా తిప్పి దానితో వారిని కొట్టడం, అనంతరం వారిని బుజ్జగించడానికి స్వీట్స్‌ని బహుమతిగా ఇస్తారు. ప్రతి వీధిలోనూ మజ్జిగతో నిండిన కుండను ఉట్టిగా కట్టి కృష్ణుడి కోసమని ఎదురు చూస్తారు.
 
మణిపూర్ ఆట మస్త్..
మణిపూర్ తదితర సమీప ప్రాంతాల వారు హోలీ చాలా ఇంట్రెస్టింగ్‌గా జరుపుకుంటారు. సాయంత్రం వేళల్లో ఫోక్ డ్యాన్సులు చేస్తూ మ్యూజిక్‌ని ఎంజాయ్ చేస్తారు. ఎండుగడ్డి, పులలు, కొమ్మలను మొదటి రోజు వెన్నెల్లో ఒక కుప్పగా వేసి కాల్చడం, ఆ తర్వాత రోజు అబ్బాయిలు అందరూ కలిసి అమ్మాయిలపై గులాల్ రంగులు చల్లుతూ పండుగ జరుపుకుంటారు. దానికి బదులుగా అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఆనవాయితీ. అంతేకాదు అక్కడ ప్రతి ఒక్కరూ తెల్లటి దుస్తులు, పగిడీలు కట్టుకొని శ్రీకృష్ణుడి గుడి ముందు ఆటపాటలతో, నృత్యాలతో సందడి చేస్తారు.
 
నేడు సెలవు
 హోలీ పర్వదినం సందర్భంగా ప్రభుత్వం బుధవారం సెలవు ప్రకటించింది. అయితే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ నెల 24న హోలీ వేడుకలకు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా మార్వాడీలు, గుజరాతీలు, ఉత్తరాది ప్రజలు హోలీ వేడుకలు గురువారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తానికి నగరంలో హోలీ వేడుకలు రెండు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.
 
రంగుల జడి.. మార్వాడీ
నగరంలో నివసించే నార్త్ ఇండియన్‌లు హోలీ పండుగ మరింత ట్రెడిషనల్‌గా జరుపుకుంటారు. ఈ పండగ కోసమని స్పెషల్‌గా వైట్ అండ్ వైట్ డ్రెస్‌ని కొనుక్కుంటారు. స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్లను పిలుచుకొని వారి వీధిలోనే ఓపెన్ ప్లేస్‌లో గెట్ టు గెదర్ అరేంజ్ చేస్తారు. అతిథులకు భాంగ్ లస్సీ ని అందిస్తూ ఆహ్వానిస్తారు. ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అంత్యాక్షరి, డ్యాన్స్, తంబోలా.. తదితర ఆటలు ఆడతారు. ఆ తర్వాత డ్రమ్స్‌లో, పిచ్‌కారీలలో రంగు నీళ్లు నింపుకొని దాగుడుమూతలు ఆడతారు. హ్యూమన్ పిరమిడ్‌లా ఒకరి మీద ఒకరెక్కి శ్రీకృష్ణుడికి ఇష్టమైన మజ్జిగ, వెన్నతో కూడిన ఒక టైట కుండను, రంగు నీళ్లలో అప్పటికే పూర్తిగా తడిసి ఉన్న అబ్బాయిలు పగలకొడతారు.
 
పేజ్‌త్రీ పీపుల్.. కలర్‌ఫుల్
ఆధునిక హోలీ సంబరాలకు అద్దం పడతారు వీరు. జంటలుగా, స్నేహితులతో సరదాగా గడపడానికి స్టార్ హోటళ్లు,రిసార్టులలో ప్యాకేజీ బుక్ చేసుకొని మరీ సంబరాలకు రెడీ అవుతారు. వెల్‌కమ్ డ్రింక్స్, స్టార్టర్స్, హాట్ డ్రింక్స్, డీజే మ్యూజిక్, పబ్‌ని తలపించే రొమాంటిక్ గేమ్స్.. ఇలా మొదలైన సెలబ్రేషన్స్ కాస్తా రంగురంగుల రెయిన్ డ్యాన్సులు, సల్సాలు, రంగులు కలిపిన స్విమ్మింగ్ పూల్ వాటర్‌లో నృత్యాలు, సెల్ఫీలతో ఒక పూర్తి స్థాయి కలర్‌ఫుల్ ఈవెంట్‌గా మారింది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement