రాష్ట్రంలో ఉల్లి సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 5 వేల సబ్సిడీ ఇవ్వాలని ఉద్యాన శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉల్లి కొరతను ఎదుర్కొనేందుకు ఉద్యానశాఖ చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. బయట నుంచి దిగుబడిని తగ్గించి రాష్ట్రంలోనే ఉల్లి సాగును ప్రోత్సహించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తోంది.
ప్రస్తుతం 75 శాతం రాయితీతో ఉల్లి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. దాంతోపాటు ఉల్లి సాగు చేసే రైతులకు రూ. 5 వేలు సబ్సిడీ ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తుండగా... మరో 10 హెక్టార్లకు పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఉల్లి సాగు కోసం ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉల్లి సాగు చేసే రైతులను గుర్తించారు. ప్రస్తుతం ఎకరానికి రూ. 60 వేల వరకు ఖర్చుచేస్తే కేవలం 6 టన్నుల ఉల్లి మాత్రమే పండుతోంది.
దీంతో కొత్తగా విత్తనం తీసుకొచ్చారు. అది ఎకరానికి 12 టన్నుల దిగుబడి వస్తోంది. ప్రస్తుతం కిలో ఉల్లి ఉత్పత్తి చేయాలంటే రూ. 10 ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఉల్లి నిల్వ కోసం రూ. 2 లక్షలు ఖర్చు అవుతుంది. అందులో రూ. లక్ష రాయితీ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇలా అనేక రకాలుగా రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఈ ఏడాది స్వయం సమృద్ధి దిశగా ముందుకు వెళ్లాలని ఉద్యానశాఖ సంకల్పించింది.