‘రోజా వీడియో’పై అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శిని ప్రశ్నించిన వైఎస్సార్‌సీఎల్పీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ నెల 18వ తేదీన సభలో జరిగిన ప్రొసీడింగ్స్‌ను తాము అడిగితే ఎవ్వరికీ ఇచ్చేది లేదని చెప్పిన తరువాత ఒక్క గంటకే అవి సోషల్ మీడియాకు లీకు అవ్వడంపై బుధవారం వైఎస్సార్ శాసనసభాపక్షం శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శిని నిలదీసింది. పార్టీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ నేత్వత్వంలోని పలువురు పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి సత్యనారాయణను కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. ‘ఈ నెల 22వ తేదీన మేం మిమ్మల్ని కలిసి 18వ తేదీన సభలో జరిగిన మొత్తం ప్రొసీడింగ్స్ కావాలని రాతపూర్వకంగా అడిగితే ‘ఎవ్వరికీ ఎటువంటి ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేద’ని చెప్పారు.
మీరు చెప్పిన ఒక్క గంటకే సోషల్ మీడియాలో శాసనసభ లోపల జరిగిన కొన్ని వీడియోలు (రోజా మాట్లాడిన మాటలు) మాత్రమే ఏ విధంగా బయటకు వచ్చాయో మీరు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. మీకు తెలియకుండా ఈ వీడియోలు బయటకు వస్తే.. ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధం. ముందుగా మీరు రాతపూర్వకంగా మాకు వివరణ ఇచ్చి, ఆ వీడియోలు విడుదల చేసి సభా సంప్రదాయాలను మంట గలిపినవారు ఎంతటి వారైనా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాక్షం తరుపున కోరుతున్నాం’ అంటూ శాసనసభా పక్ష ఉప నేత జోత్యుల నెహ్రూ పేరుతో అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
శాసనసభ లోపల జరిగిన ప్రొసీడింగ్స్‌ను స్పీకర్ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మీడియాకు విడుదల చేయడం జరిగితే తమకు అభ్యంతరం లేదని.. అయితే, స్పీకర్ కానీ, స్పీకర్ కార్యాలయం కానీ ఇప్పటి వరకు అసెంబ్లీ లోపల జరిగిన ప్రొసీడింగ్స్‌ను అధికారికంగా విడుదల చేయడం జరగలేదని జోత్యుల నెహ్రూ పేర్కొన్నారు. అవి బయటకు పొక్కడానికి కారకులపై చర్యలు తీసుకోకుంటే.. శాసనసభ కార్యదర్శి, లేదంటే స్పీకర్ కార్యాలయం నుంచే అవి బయటకు వచ్చాయని అనుమానించాల్సి ఉంటుందని నెహ్రూ శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారు.
సోషల్ మీడియాలో ఎలా వచ్చాయి?
Published Thu, Dec 24 2015 4:16 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
Advertisement
Advertisement