సాక్షి, సిటీబ్యూరో: సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో కంటిశుక్లాల తొలగింపు శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించడంతో పాటు ఈ నెల 21లోగా తుది నివేదిక అందజేయాలని తెలంగాణ సీఎస్ సహా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌లను ఆదేశించించింది.
నూకాలమ్మకు కార్నియా మార్పిడి చికిత్స:
కంటిచూపు మందగించడంతో మెరుగైన చూపుకోసం గత నెల 30న ఆస్పత్రిలో 21 మంది కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. రింగర్స్ లాక్టేట్ (ఆర్‌ఎల్)సెలెన్‌వాటర్‌తో కళ్లను శుభ్రం చేయడం వల్ల 13 మందికి ఇన్‌ఫెక్షన్ బారినపడగా, వీరిలో ఏడుగురి కంటి చూపు దెబ్బతింది. వీరిలో ఇద్దరికి చూపు వచ్చే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేయడం తెలిసిందే. వాసన్‌ఐ కేర్ నుంచి కార్నియాను సేకరించి కంటిచూపు కోల్పొయిన బాధితురాలు నూకాలమ్మతల్లికి శుక్రవారం ఆస్పత్రి ఎమర్జెన్సీ థియేటర్‌లో కార్నియా మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరు బాధితులు కూడా చికిత్సకు రెస్పాండ్ అవుతున్నట్లు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్‌గుప్తా స్పష్టం చేశారు.
ఉస్మానియా, గాంధీలో చికిత్సలు:
ఆర్‌ఎల్ సెలైన్‌బాటిల్లో బ్యాక్టీరియా ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఆపరేషన్ థియేటర్లలోని వైద్య పరికరాల్లో కూడా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తా చర్యల్లో భాగంగా జులై ఒకటో తేదీ న వాటిని మూసివేసిన విషయం తెలిసిందే. చికిత్సలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతుండటంతో ప్రభుత్వం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వచ్చిన రోగులను ఆయ ూ ఆస్పత్రులకు తరలించి అక్కడే వారికి కాటరాక్ట్ సర్జరీలు చేసేందుకు అవసరమైన వైద్య బందాలను కూడా సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మైక్రోబయాలజీ నిపుణులు ఆపరేషన్ థియేటర్లలో శాంపిల్స్ సేకరించారు. తుది నివేదిక రావడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉంది. థియేటర్‌లో ఇన్‌ఫెక్షన్ లేదని నిర్ధారించిన తర్వాతే ఇక్కడ సేవలను పునఃప్రారంభిస్తామని, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్‌గుప్తా స్పష్టం చేశారు.
పీఎస్‌లో ఆమ్‌ఆద్మీ ఫిర్యాదు:
ఆస్పత్రులకు నాసిరకం మందులు సరఫరా కావడానికి, ఏడుగురు బాధితులు కంటి చూపు కోల్పోవడానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, టీఎస్‌ఎంఐడీసీ ఎండీల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర కో కన్వీనర్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సహా సంబంధిత అధికారులపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పోలీసులు సెక్షన్ 338 కింద కేసు నమోదు చేశారు.