బా..బ్బా..బ్బాబు..బాన్ | Hyderabad bans begging on city roads | Sakshi
Sakshi News home page

కనిపిస్తే.. పట్టివేత

Published Fri, Jan 5 2018 8:20 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

Hyderabad bans begging on city roads  - Sakshi

నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనపై నిషేధాన్ని పొడిగిస్తూ నగర పోలీసు కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్లోబల్‌  ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌) నేపథ్యంలో తొలిసారిగా నవంబర్‌ 8న భిక్షాటనపై నిషేధం విధించారు. అప్పట్లో నిర్దేశించిన రెండు నెలల గడువు ముగుస్తుండడంతో మరో రెండు నెలలు పొడిగించారు. వాహన చోదకులు, పాదచారులకు యాచకుల వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్‌ తెలిపారు. ఈ నెల 7 నుంచి అమలులో ఉండే ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   

సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనపై నిషేధాన్ని పొడిగిస్తూ నగర పోలీసు కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా... భిక్షాటనకు సంబంధిం చిన ప్రజాహిత వ్యాజ్యాలు ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉన్నాయి. పేదరికం వల్ల భిక్షాటన చేయడం నేరం కాదని ప్రాథమికంగా అభిప్రాయపడిన న్యాయస్థానం దీనిపై ఈనెల 9న తీర్పు వెలువరించనుంది. అది నగర పోలీసుల నిషేధాజ్ఞలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. గ్లోబ ల్‌ ఎంటర్‌పెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌) నేపథ్యంలో తొలిసారిగా  నవంబర్‌ 8న భిక్షాటనపై నిషేధం విధించారు. అప్పట్లో నిర్దేశించిన రెండు నెలల గడువు ముగుస్తుండటంతో మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాహనచోదకులు, పాదచారులకు బిచ్చగాళ్ల వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ తెలిపారు.

ఈ నెల 7 నుంచి రెండు నెలల పాటు అమలులో ఉండే ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. పలువురు బిచ్చగాళ్ళు అభ్యంతరకరంగా బిచ్చమెత్తుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిలో కొందరు చిన్న పిల్లలు, దివ్యాంగుల్ని సైతం ప్రత్యేకంగా నియమించుకుంటున్నట్లు తెలిసిందన్నారు. వీరు పాదచారులు, వాహనచోదకుల నుంచి బిచ్చం తీసుకునేందుకు అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. వీరి చర్యలు కొన్ని సందర్భాల్లో పాదచారులు, వాహనచోదకులకు ప్రమాదహేతువులుగా మారుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, జంక్షన్లలో బిచ్చమెత్తుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు కొత్వాల్‌ ప్రకటించారు. ఈ నిషేధం మరో రెండు నెలల పాటు లేదా ఉపసంహరించే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. వీటిని ఉల్లంఘించిన వారిపై ఐపీసీలోని 188 సెక్షన్‌తో పాటు హైదరాబాద్‌ పోలీసు చట్టం, తెలంగాణ ప్రివెన్షన్‌ ఆఫ్‌ బెగ్గింగ్‌ యాక్ట్, జ్యువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐపీసీ 188 సెక్షన్‌ ప్రకారం ఓ ప్రభుత్వ అధికారి ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే గరిష్టంగా నెల రోజుల జైలు లేదా రూ.200 జరిమానా లేదా రెండూ విధించే ఆస్కారం ఉంటుంది. 

నేరం కాదన్న న్యాయస్థానం...
నగరంలో బిచ్చగాళ్ళపై నిషేధం కొనసాగుతుండగా.. ఈ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు ఇవ్వనున్న తీర్పు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీలోని బిచ్చగాళ్ళ ప్రాథమిక హక్కుల సాధన కోసం, ఆ వృత్తిని నేరంగా పరిగణించకూడదంటూ అక్కడి హైకోర్టులో రెండు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిత్తల్, జస్టిస్‌ హరిశంకర్‌ల నేతృత్వంలోని ధర్మాసనం గతేడాది నవంబర్‌ 28న కీలక వ్యాఖ్యలు చేసింది. పేదరికం కారణంగా భిక్షాటన చేస్తే నేరంగా చూడకూడదంటూ వ్యాఖ్యానించింది. ఎవరైనా వ్యక్తులు మరొకరి బలవంతంపై కానీ లేదా సాధారణంగా బతికేందుకు అవసరమైన అన్ని వనరులు, శక్తిసామర్థ్యాలు ఉండి కూడా బిక్షాటన చేస్తే దాన్ని నేరంగా పరిగణించవచ్చంటూ పేర్కొంది.

ఈ కేసు వాదోపవాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. యాచకులు నిజంగా పేదరికంలో ఉన్నారా? లేదా? అనేది నిర్థారించేందుకు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో ఈ వ్యాజ్యాలపై తీర్పును ఢిల్లీ హైకోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది. దీనిపై తీర్పు వెలువడితే  ఆ ప్రభావం నగర పోలీసుల ఉత్తర్వులపై ఏ మేరకు ఉంటు ందో వేచిచూడాలి. మరోపక్క దీనికి సంబంధించిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ప్రాథమిక వ్యాఖ్యల నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు సాధారణంగా బతికేందుకు అవసరమైన వనరులు ఉన్నప్పటికీ బిక్షాటన చేయడాన్ని నేరంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. జైళ్ళశాఖ ఆధీనంలో ఆనందాశ్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా బిచ్చగాళ్ళకు ఆ వనరుల్ని ప్రభుత్వం కల్పిస్తోంది. వాటిని వినియోగించుకోకుండా రహదారులపై భిక్షాటన చేయడం నేరమే అవుతుంది’ అని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement