
త్వరలో 4జీ వైఫై
* సెప్టెంబర్ నెలాఖరులోగా రాజధాని నగరంలో అందుబాటులోకి..
* దశల వారీగా రాష్ట్రమంతటికీ.. తొలి ఆర్నెల్లు ఉచిత సేవలు
* అనంతరం నెలకు దాదాపు రూ. 1,200
సాక్షి, హైదరాబాద్ : రాజధాని నగర ప్రజలకు శుభవార్త. నెలకు దాదాపు రూ. 1,200 చెల్లిస్తే చాలు.. ఇంటర్నెట్, కంప్యూటర్, టీవీ, సెల్‌ఫోన్ సేవలన్నీ సొంతం కానున్నాయి. ఒకే ఒక్క 4జీ వైఫై కనెక్షన్‌తోనే ఈ సేవలన్నీ వినియోగదారులకు అందనున్నాయి. సెప్టెంబర్ నెలాఖరులోగా గ్రేటర్ నగరంలోని వెస్ట్‌జోన్.. పర్యాటక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లోనూ.. డిసెంబర్ నెలాఖరు నాటికి రాజధాని నగరంలోని ప్రజలందరికీ 4జీ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి.
దశలవారీగా రాష్ట్రమంతటికీ ఈ సేవలు విస్తరించనున్నాయి. అక్టోబర్‌లో నగరంలో జరగనున్న ‘మెట్రోపొలిస్’ సదస్సు దృష్ట్యా.. సెప్టెంబర్ నెలాఖరులోగానే సదస్సు జరగనున్న హైటెక్స్, విదేశీ అతిథులు పర్యటించే ప్రదేశాలు.. వారు విడిది చేసే హోటళ్ల ప్రాంతాల్లో ఈ సేవల్ని అందుబాటులోకి తేవాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ‘4జీ వైఫై నగరంగా హైదరాబాద్’ అనే అంశంపై ఐటీ మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గ్రేటర్‌లో ఇప్పటికే 4జీ సేవల లైన్లు ప్రారంభించిన రిలయన్స్ సంస్థ ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఎలాంటి అనుమతులు కావాలన్నా మంజూరు చేస్తామని, సదస్సు లోగా వైఫై సేవలు అందుబాటులోకి తేవాల్సిందిగా సీఎం రిలయన్స్ ప్రతినిధులకు సూచించారు. సమయం తక్కువగా ఉన్నందున.. రోడ్ల కటింగ్‌ల వల్ల తలెత్తే ఇబ్బందులు.. వర్షాకాల సమస్యల దృష్ట్యా ప్రస్తుతానికి టవర్స్ ఏర్పాటు ద్వారా ఏరియల్ కేబుల్స్‌తో ఈ సేవల్ని అందుబాటులోకి తేనున్నారు. భూగర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అందుబాటులోకి వచ్చేంతవరకు ఏరియల్ కేబుల్స్‌ను వినియోగించాల్సిందిగా సీఎం సూచించారు. 4జీ వైఫై సేవల కనెక్షన్లకు నెలకు దాదాపు రూ. 1,200 వసూలు చేసేందుకు రిలయన్స్ ప్రతిపాదించినట్లు తె లిసింది.
తొలివిడతగా 6 కార్పొరేషన్లు, 37 మునిసిపాలిటీల్లో..
సమావేశంలో పాల్గొన్న రిలయన్స్ రాష్ట్ర సీఈఓ కెఎస్ వేణుగోపాల్, కో ఆర్డినేటర్ పీవీఎల్ మాధవరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో వైఫై సేవ ల కోసం తాము రూ. 4,100 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంలోనే 1,700 కి.మీ.ల ఓఎఫ్‌సీ లైను వేస్తున్నామని, ప్రస్తుతం 500 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయని చెప్పారు.
నగరంలో తొలి ఆరు మాసాలు ఉచితంగా వైఫై సేవలందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను వైఫై నగరంగా మారుస్తామన్నారు. తొలివిడతలో తెలంగాణలోని ఆరు కార్పొరేషన్లు, 37 మునిసిపాలిటీల్లో, రెండో విడత ఇతర నగరాలు, పట్టణాలు, 220 మండల కేంద్రాల్లో, మూడో విడతలో తెలంగాణ మొత్తంలో 4జీ సేవలందించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.