హైదరాబాద్ : సంస్కృతి, సంప్రదాయాలు,కుల, మత, ఆచార వ్యవహారాలతోపాటు మానవ సంబంధాల విషయంలో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారంరాత్రి ఇక్కడి ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ ఫెస్ట్–2018 ని ప్రారంభించారు. అనంతరం సుద్దాల హనుమంతు వేదికపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కళలు, సాహిత్యం, విజ్ఞాన రంగాల విస్తరణకు ఇలాంటి సంబురాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
భవిష్యత్‌లో సమాజం మళ్లీ పాత మానవ సంబంధాలనే కోరుకుంటుందని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాలు సుస్థిరంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధిపథంలో ముందుకుపోతుందన్నారు. అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తూ హైదరాబాద్ అందరినీ కలుపుకుపోతోందని తెలిపారు. దేశంలో ఎవరైనా, ఏదైనా ఏర్పాటు చేసుకుని బతకాలంటే ముందుగా వారి చూపు హైదరాబాద్ వైపు ఉంటుందని పేర్కొన్నారు. దేశంలో మతం పేరుతో జరుగుతున్న సంఘటనలు ఎంతో బాధాకరమని అన్నారు.
కొన్ని రోజులు చీకటి అధ్యాయముంటుందని, దానిని ప్రజలే అంతం చేస్తారని చెప్పారు. ప్రజల ఆత్మగౌరవాన్ని వస్తువుగా వాడుకునే ఏ పాలకుడినీ ప్రజలు హర్షించరన్నారు. నంద్యాల నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ ఫెస్ట్ గౌరవ అధ్యక్షుడు చుక్కా రామయ్య, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ సినీనటుడు, దర్శకుడు ఎల్బీ శ్రీరాం, ప్రముఖ సినీ దర్శకుడు అల్లాణి శ్రీధర్, హైదరాబాద్ ఫెస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment