‘హైట్’ను సొమ్ము చేసుకున్న హైటెక్ ఆస్పత్రి | hyderabad global hospital done surgery for height increasing | Sakshi
Sakshi News home page

‘హైట్’ను సొమ్ము చేసుకున్న హైటెక్ ఆస్పత్రి

Published Wed, Apr 6 2016 2:56 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

‘హైట్’ను సొమ్ము చేసుకున్న హైటెక్ ఆస్పత్రి - Sakshi

‘హైట్’ను సొమ్ము చేసుకున్న హైటెక్ ఆస్పత్రి

  • 3 రోజుల క్రితం కనిపించకుండాపోయిన నిఖిల్...
  • కాళ్లకు సర్జరీతో ఎత్తు పెంచుకునేందుకు గ్లోబల్ ఆస్పత్రిలో చేరిక
  • కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఆపరేషన్ చేసిన వైద్యులు
  • ఆరు నెలలు బెడ్‌రెస్ట్, మూడు నెలలు వీల్‌చైర్‌పై ఉండాల్సిన పరిస్థితి
  • ఆస్పత్రి నిర్వాకంపై తల్లిదండ్రుల ఆందోళన
  • ఇలాంటి శస్త్రచికిత్సలు ప్రమాదకరమంటున్న వైద్యులు
  •  
    హైదరాబాద్:
    పొడవు పెరగాలనే ఆరాటం.. అందుకోసం కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయం.. తల్లిదండ్రులకు చెబితే ఏమంటారోనన్న ఆందోళన.. వెరసి చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వచ్చేసి, ఆపరేషన్ చేయించుకున్న ఓ యువకుడి ఉదంతం సంచలనం రేపింది. అసలు తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే... రెండు కాళ్లకూ శస్త్రచికిత్స చేసిన నగరంలోని గ్లోబల్ ఆస్పత్రి నిర్వాకం వివాదాస్పదంగా మారింది. ఎత్తు పెరగడం మాటేమోగానీ... ఆ యువకుడు ఆరు నెలలపాటు బెడ్‌పైనే, మరో మూడు నెలలు చక్రాల కుర్చీలోనే ఉండాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఆవేదన నింపుతోంది.

    తొలుత మిస్సింగ్.. ఆపై సర్జరీ..
    బోయిన్‌పల్లిలో నివాసముండే వ్యాపారి గోవర్ధన్‌రెడ్డి రెండో కుమారుడు నిఖిల్‌రెడ్డి (22). బంజారాహిల్స్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 5.7 అడుగుల ఎత్తున్న నిఖిల్‌కు ఇంకా ఎత్తుగా ఉండాలని బలమైన కోరిక. దీంతో కాళ్ల పొడవు పెంచే శస్త్రచికిత్స కోసం కొంత కాలంగా గ్లోబల్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యుడు చంద్రభూషణ్‌నుసంప్రదిస్తున్నాడు. చివరికి ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు ‘లింబ్ లెన్త్ నీ విత్ లింబ్ రీ కనస్ట్రక్షన్ (మోకాలు, కింద ఎముక పునర్నిర్మాణం)’ శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్దమయ్యాడు. ఇందులో మోకాలు వద్ద నుంచి కాలు కింది ఎముకలోకి ఇంప్లాంట్లను పంపి.. కాలు పొడవు దాదాపు మూడు అంగుళాలు పెరిగేలా చేస్తారు. అయితే ఈ శస్త్రచికిత్స చేయించుకుంటున్న విషయం నిఖిల్ తమ కుటుంబసభ్యులకు చెప్పలేదు.

    ఆదివారం(ఈనెల 3న) అర్ధరాత్రి ఇంట్లోంచి వచ్చేసి, సోమవారం ఉదయం ఆస్పత్రిలో చేరాడు. తమ కుమారుడికోసం గాలించిన తల్లిదండ్రులు.. సోమవారం పేట్‌బషీర్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు మంగళవారం రోహిత్ సంతకం తీసుకుని శస్త్రచికిత్స ప్రారంభించారు. అయితే బంధువులు నిఖిల్ సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా గాలించి.. అతను గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుసుకున్నారు.

    తల్లిదండ్రులకు చెప్పకుండా చేస్తారా..?
    తాము గ్లోబల్ ఆస్పత్రికి వెళ్లేలోగా అప్పటికే నిఖిల్‌కు శస్త్రచికిత్స జరుగుతోందని.. అతడిని కలవాలని ఎంత ప్రాధేయపడ్డా అవకాశం ఇవ్వలేదని నిఖిల్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. అసలు కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఇంత పెద్ద ఆపరేషన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇదేమని అడిగితే చెప్పాల్సిన అవసరం లేదంటూ తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. తమ కుమారుడు నరకయాతన అనుభవిస్తున్నాడని.. ఆరు నెలలు బెడ్‌రెస్ట్‌తో పాటు మూడు నెలలు వీల్‌చైర్‌పై తిరగాల్సి ఉంటుందని వైద్యులే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డబ్బు కోసమే తమ కుమారుడికి ఆపరేషన్ చేశారని ఆరోపించారు.

    రోగి అనుమతితోనే ఆపరేషన్ చేశాం
    ‘‘నిఖిల్ ఏడాది కాలంగా మా ఆస్పత్రిని సంప్రదిస్తున్నారు. ఆయన మేజర్ కావడంతో ఆయన అనుమతితోనే ఆపరేషన్ చేశాం. మెడికో లీగల్ కేసు కాదు కాబట్టి పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం రోగి మేజర్ అయితే వారి అనుమతితోనే శస్త్రచికిత్స చేయవచ్చు. మేం నిఖిల్‌ను బలవంతంగా ఇంటి నుంచి తీసుకురాలేదు. ఆయన శస్త్రచికిత్స విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పకపోతే ఆ తప్పు మాది కాదు..’’
     - గ్లోబల్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శివాజీ చటోపాధ్యాయ


     ఇలాంటి సర్జరీలతో ప్రమాదమే..
     ‘‘సాధారణంగా ప్రమాదాలు జరిగినపుడు ఎముకలు విరిగిన పేషెంట్లకు మాత్రమే ఇలాంటి శస్త్రచికిత్సలు చేస్తారు. కానీ క్రమంగా ఎత్తు పెంచేందుకు ఇలాంటి సర్జరీలు చేస్తున్నారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్నవారు కోలుకునేందుకు 8 నుంచి 9 నెలల సమయం పడుతుంది. కొన్నిసార్లు ఇవి విఫలమై ఎముకలు సరిగా అతుక్కోకపోవడం, చీము పట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాళ్లను పొడవు పెంచితే పొట్ట, చేతులు చిన్నవిగా కనిపించి, అందవిహీనంగా కనిపిస్తారు. మూడు నుంచి నాలుగు అంగుళాల ఎత్తు పెంచే ఇలాంటి సర్జరీలు చట్టరీత్యా తప్పుకాదు. కానీ ప్రమాదం ఎక్కువ..’’
     - డాక్టర్ నరేంద్రనాథ్, నిమ్స్ మాజీ డెరైక్టర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement