సురక్షిత నగరంగా హైదరాబాద్
నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి
కాచిగూడ : సురక్షిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో నగరంలోనే మొట్టమొదటి సారిగా బర్కత్‌పురలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నగరంలో త్వరలోనే లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆరు నెలలుగా నగరవాసులకు సీసీ కెమెరాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
హౌసింగ్‌బోర్డు కాలనీ ప్రజలు ముందుకు వచ్చి తమ సొంత ఖర్చుతో 16 కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసే మానిటరింగ్ సిస్టంతో నగరంలోని అన్ని కెమెరాలు కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కమాండ్ కంట్రోల్ సిస్టం కోసం ప్రభుత్వం రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందని అన్నారు. సీసీ కెమెరాలు జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డు తదితర ప్రభుత్వ విభాగాలకు కూడా ఉపయోగపడేవిధంగా మానిటర్ చేస్తామన్నారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు టి.శేషునారాయణ, అడిషనల్ సీపీ అంజన్‌కుమార్, డీసీపీ వి.రవీందర్, అడిషనల్ డీసీపీ ఎల్‌టీ చంద్రశేఖర్, కాచిగూడ ఏసీపీ సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.