మెట్రో రైలుకు డ్రైవర్ అక్కర్లేదు!
హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులకు ఈ వార్త న్యూ ఇయర్ గిప్ట్గా చెప్పుకోవచ్చు. అనేక ప్రత్యేకతలు కలిగిన హైదరాబాద్ మెట్రోరైలు మరో మైలురాయిని అధిగమించింది. ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ (ఏటీఓ) ద్వారా విజయవంతంగా రైలు నడిపి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఒకప్పుడు ఊహలకు మాత్రమే పరిమితం అయిన డ్రైవర్ రహిత రైలు ఇప్పుడు... నగర వాసులకు అందుబాటులోకి రానుంది.
డ్రైవర్తో సంబంధం లేకుండా తనంతట తానే పరుగులు తీయటమే కాకుండా అవసరం అయినప్పుడు వేగాన్ని నియంత్రించుకోవటంతో పాటు బ్రేకులు వేసుకోవటం దాని ప్రత్యేకత. ఇక డ్రైవర్ ఏం చేస్తారనే అనుమానం మీకు రావచ్చు... డ్రైవర్ కేవలం రైల్వేస్టేషన్లో ఎక్కి, దిగే ప్రయాణికులను గమనిస్తూ రైలు తలుపులు మూసే బటన్ను నొక్కటమే.
నాగోల్-మెట్టుగూడ మార్గంలో మెట్రో రైలు ఈ టెస్ట్ రన్ను నిర్వహించారు. భారతదేశంలోనే ఈ తరహా టెక్నాలజీని ఉపయోగించటం ఇదే తొలిసారి. ఇందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాంకేతిక యంత్ర పరికరాలను ఫ్రెంచ్ కంపెనీ అయిన థాలెస్ సంస్థ అందించింది.