
విదేశీయులకు ‘హైదరాబాద్ పాస్’
♦ లండన్ తరహాలో పర్యాటకుల కోసం చవకగా ఓ స్మార్ట్‌కార్డు
♦ మరెక్కడా రుసుము చెల్లించకుండా సేవలన్నీ అందులోనే..
♦ హోటల్, రైలు, విమాన టికెట్లకు వేరుగా డబ్బు చెల్లించనక్కర లేకుండా
♦ విదేశీ పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: లండన్ పాస్.. ప్రపంచ పర్యాటకులకు సుపరిచితమైన పేరు. లండన్‌లో కాలుమోపిన విదేశీ పర్యాటకులకు అక్కడి అధికారులు తక్కువ ధరకు అందించే స్మార్ట్‌కార్డ్ ఇది. లండన్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఎక్కడా సందర్శన టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా, క్యూలో నిలబడాల్సిన పనిలేకుండా నేరుగా లోనికి వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇదే తరహాలో ‘హైదరాబాద్ పాస్’ను అందుబాటులోకి తేవాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్న ప్రభుత్వం అందులో భాగంగా హైదరాబాద్ పాస్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. పర్యాటక స్థలాలతోపాటు హోటల్ గదులు, విమాన, రైలు టికె ట్లు కొనకుండా దీని ద్వారానే అన్నీ పొందేలా రూపకల్పన చేయబోతోంది.
తక్కువ ధరకే..
భాగ్యనగరానికి వచ్చే టూరిస్టులకు పర్యాటక శాఖ పక్షాన ‘హైదరాబాద్ పాస్’ను అందజేస్తారు. ఆ పర్యాటకులు సందర్శించే ప్రాంతాలు, నగరంలో ఉండే రోజులు.. తదితరాల ఆధారంగా దీని ధరలను నిర్ధారిస్తారు. విడివిడిగా ఆయా సేవలు పొందేందుకు చెల్లించే మొత్తంతో పోలిస్తే వీటి ధర చాలా తక్కువ. దాన్ని కొన్న పర్యాటకుడు మరెక్కడా ఏ టికెట్ కొనాల్సిన పనిలేకుండా ఉపయోగించుకోవచ్చు. ఆ పాస్‌ను హోటళ్లు, ఎయిర్‌లైన్స్, పర్యాటక ప్రాంతాలతో అనుసంధానిస్తారు. ఇందుకోసం పర్యాటక శాఖ నగరంలోని అన్ని ప్రముఖ హోట ళ్లలో 5% గదులను, కొన్ని విమాన టికెట్లను రిజర్వ్ చేసి ఉంచుతుంది. వాటిని హైదరాబాద్ పాస్‌తో అనుసంధానించి రాయితీ ధరకు పర్యాటకులకు అందజేస్తుంది. ఇందుకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హోటళ్లు, విమానయాన సంస్థలు, రైల్వేతో కలసి పనిచేస్తుంది.
విదేశీ పర్యాటకులకు ‘ప్రత్యేక హోదా’
రాష్ట్ర పర్యటనకు వచ్చే విదేశీ పర్యాటకులకు ప్రత్యేక అతిథి హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు ప్రయాణించే కారుపై ప్రత్యేక సింబల్ ఏర్పాటు, వారు రాగానే హోటల్ సిబ్బంది సంప్రదాయ రీతిలో స్వాగతం పలకటం, షాపింగ్ చేస్తే రాయితీ ధరలకు వస్తువులు ఇవ్వడం.. తదితరాలు ఇందులో భాగం. విదేశాల్లో ఉంటున్న తెలంగాణవారు తెలంగాణ పర్యాటకానికి సాయపడే మరో అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
2020 నాటికి 10 లక్షల పర్యాటకులు లక్ష్యం
ప్రస్తుతం తెలంగాణకు వచ్చే వార్షిక పర్యాటకుల సంఖ్య లక్ష లోపే. దాన్ని 2020 నాటికి 10 లక్షలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2017 నాటికి 3 లక్షలు, 2018 నాటికి 5 లక్షలకు పెంచి తుదకు లక్ష్యాన్ని చేరుకోవాలనేది ప్రణాళిక. అందులో భాగంగానే ఈ కొత్త ప్రణాళికలపై దృష్టి సారించినట్టు పర్యాటకశాఖ కార్యదర్శి వెంకటేశం ‘సాక్షి’తో చెప్పారు.