బైక్ రేసర్లపై కొరడా
ఖైరతాబాద్/ రాంగోపాల్‌పేట్: బైక్ రేసింగ్‌లను అరికట్టేందుకు ఆదివారం నెక్లెస్ రోడ్డులో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 72 బైక్‌లను సీజ్ చేశారు. సైఫాబాద్, రాంగోపాల్‌పేట్, లేక్ పోలీసులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి.. యువకులను అదుపులోకి తీసుకొని, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల విలువ చేసే వివిధ రకాల బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అడిషినల్ డీసీపీ రాంమోహన్‌రావు మాట్లాడుతూ ఇంటర్, డిగ్రీ చదివే పిల్లలు రేసింగ్ మోజుతో ఉదయం లేవగానే బైక్‌లపై ఇక్కడికి వస్తున్నారు.
అతివేగంతో, ఫీట్లు చేస్తూ ప్రమాదాల బారిన పడటమే కాకుండా నెక్లెస్ రోడ్డులో వాకింగ్‌కు వచ్చే వారిని ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ప్రాణాలపై తెస్తున్నారు. ఇలాంటి రేసింగ్‌లు ఇక్కడ పూర్తిగా నిషేధించాలనే లక్ష్యంతో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని చెప్పారు. స్పెషల్ డ్రైవ్‌లో 72 ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు సీజ్ చేసిన వాహనాలు మరోసారి గనుక పట్టుపడితే వారి లెసైన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఇంటర్ చదివే విద్యార్థికి రూ. 2 లక్షల విలువ చేసే బైక్ అవసరమా అనే విషయాన్ని తల్లిదండ్రులు ఆలోచించాలని ఆయన సూచించారు. మరో మారు ఇలాగే వచ్చి రేసింగ్‌లకు పాల్పడి పోలీసులకు చిక్కితే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్‌లో సైఫాబాద్ ఏసీపీ సురేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు గంగారెడ్డి, జానకమ్మ పాల్గొన్నారు.