
రోడ్డెక్కితే అంతే! ఉప్పల్‌లో నాలుగు గంటలు నరకయాతన
మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఎలా ఉంటుందో తెలియదు గానీ... ప్రస్తుతం మాత్రం దాని దెబ్బకు క్షణక్షణం నరకం చూస్తున్నాడు వాహనదారుడు. దానికితోడు వర్షాలు... ఎక్కడ చూసినా గుంతలు... కావల్సినంత బురద... వద్దన్నా వచ్చిపడే దుమ్ము... అన్నింటికీ మించి నిర్లక్ష్యపు వ్యవస్థ... గమ్యం చేరేలోపే సిటీజనుడి బండే కాదు... ఒళ్లూ ‘గుల్ల’వుతోంది. ఈ ఫొటోలు ఉప్పల్ నుంచి హబ్సిగూడ వెళ్లే రహదారిలోనివి. రాత్రికిరాత్రే రోడ్లపై ఉన్న గుంతలను రబ్బీస్‌తో పూడ్చారు మెట్రో సిబ్బంది. దీంతో మంగళవారం ఉదయం... వచ్చిన వాహనం వచ్చినట్టు ఆ రబ్బీస్‌లో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా కదలని పరిస్థితి. చివరకు పక్కనున్న వాహనదారులు దిగి తోస్తే కానీ బయట పడలేదు. నిమిషనిమిషానికీ పరిస్థితి మరింత దిగజారింది.
ఉదయం 8 గంటలు మొదలు ఇదే తంతు. ఎటు చూసినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందికి పదేపదే సమాచారమందించినా గంట తరువాత గానీ అక్కడకు చేరుకోలేదు. స్కూళ్లు, కార్యాలయాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరైతే బండి దిగి కాలినడకన వెళ్లారు. అక్కడక్కడా ఉన్న వరదనీటి కాలువలను మెట్రో, ఆర్ అండ్ బీ అధికారులు మూసివేయడంతో వాన నీరు రోడ్లపైనే నిలిచిపోతోంది. అవి చాలవన్నట్టు రోడ్డుకిరువైపులా ఫుట్‌పాత్ వ్యాపారాలు. వెరసి ఎక్కినవారిని ముప్పుతిప్పలు పెట్టి... ముచ్చమటలు పట్టిస్తున్నాయి ‘మహా’నగర రోడ్లు.