
కొత్తగా ఓటు వచ్చెనా..
ఓటు హక్కుపై యువతలో నవచైతన్యం వెల్లివిరుస్తోంది. యువతీ యువకులు, కళాశాల విద్యార్థులు ఈ ఏడాది అనూహ్యంగా అధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఏటా 18-19 ఏళ్ల గ్రూపు వారు 30 నుంచి 33 శాతం మాత్రమే ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకుంటుంటారు. నిరుడు 31 శాతం మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోగా.. ఈ ఏడు అది అనూహ్యంగా 88 శాతానికి పెరిగింది. ఓటు హక్కుపై విస్తృత ప్రచారం.. కళాశాలల్లో ఓటరు నమోదుకు ఏర్పాట్లు.. ఎన్నికల ఏడాది కావడం.. పార్టీలు కొత్త ఓటర్లను చేర్చడం.. తదితర కారణాల వల్ల యువత ఓటు హక్కు కోసం అధిక ఆసక్తిని ప్రదర్శించారు.
సాక్షి, సిటీబ్యూరో: యువత ఓటర్ల నమోదు కార్యక్రమంలో అనూహ్యంగా పాల్గొంది. ఓటుపై ప్రచారం అధికంగా జరగడం.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయం.. యువతలో, ముఖ్యంగా విద్యార్థుల్లో ఓటుహక్కుపై ఆసక్తి రేకెత్తించింది. వీటితోపాటు విద్యార్థులు సైతం రాజకీయాలపై ఆసక్తి చూపుతుండటం.. తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో సత్తా చూపించాలనే అభిప్రాయం ఏర్పడటం ఓటరు జాబితాలో నమోదును పెంచిందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కొత్త ఓటర్ల అభినందన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొత్తగా ఓటరుగా నమోదైన 18 -19 ఏళ్ల వారికి ‘ఓటరుగా గర్విస్తున్నాను.. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అనే నినాదంతో కూడిన బ్యాడ్జీని అందజేయనున్నారు. వీరిలో నలుగురైదుగురికి కలర్ ఎపిక్ కార్డులు అందజేయనున్నారు. మిగతావారికి ఫిబ్రవరిలో ఇంటింటికీ వెళ్లి ఓటరు కార్డులందజేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ న వీన్‌మిట్టల్ పేర్కొన్నారు. వీటితోపాటు ఓటర్లతో ప్రతిజ్ఞ కార్యక్రమం తదితరమైనవి నిర్వహించనున్నారు.
నగరంలో ఏడాది పొడవునా ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతున్నప్పటికీ, ఇటీవల విస్తృత ప్రచారం నిర్వహించినప్పటికీ, ఇంకా పేర్లు నమోదు చేయించుకోని వారున్నారు. వారు తమ పేర్లను నమోదు చేయించుకోవచ్చు. తద్వారా భవిష్యత్‌లో పోలింగ్ రోజున ఇబ్బందులుండవు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు.. తప్పుల సవరణలకు దరఖాస్తుల స్వీకరణ, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 3091 పోలింగ్ కేంద్రాల్లో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటరు దరఖాస్తులు స్వీకరిస్తారు.
జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా పోటీలు
జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా నగరంలోని సిటీ మేనేజర్స్ ట్రైనింగ్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన వక్తృత్వం, క్విజ్, డ్రాయింగ్ పోటీల్లో రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి 165 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు హెదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులు ఓటు హక్కు, ఓటు విలువ గురించి సృజనాత్మకంగా తమ ఆలోచనలను వె ల్లడించినట్లు తెలిపారు. విజేతలకు శ నివారం రవీంద్రభారతిలో జరిగే ఓటరు దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.
పాటించాల్సినవి
ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించుకునేవారు నిబంధనలకనుగుణంగా పొరపాట్లు లేకుండా దరఖాస్తు ఫారాలు భర్తీ చేయాలి.
అక్షరాలు స్పష్టంగా అర్థమయ్యేలా రాస్తే ఓటరు కార్డులోనూ తప్పులు దొర్లేందుకు అవకాశం ఉండదు.
కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఫారం-6, ఇతరత్రా మార్పుల కోసం సంబంధిత ఫారం-7, ఫారం-8, ఫారం-8ఎలను అందుబాటులో ఉంచుతారు. అక్కడి సిబ్బందిని సంప్రదించి కావాల్సిన ఫారాన్ని భర్తీ చేసి ఇవ్వవచ్చు.
ఓటరు దరఖాస్తు ఫారంతోపాటు చిరునామా ధ్రువీకరణ పత్రం (రేషన్‌కార్డు, కరెంటు బిల్లు వంటి) జిరాక్స్ ప్రతి జత చేయాలి.
దరఖాస్తు చేసుకున్నాక, బూత్‌లెవెల్ ఆఫీసర్ (బీఎల్‌వో) విచారణకు వచ్చినప్పుడు ఇంట్లో ఉండని పక్షంలో.. సదరు ఇంట్లోనే ఉంటున్నట్లు కనీసం సమాచారం ఇచ్చేవారు ఉండాలి.
ఓటు పొందేందుకు ఆన్‌లైన్ ద్వారానూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓటరు కార్డును అడ్రస్‌ప్రూఫ్‌గా వినియోగించుకోవాలనుకుంటే ఇంటిపేరు కూడా పూర్తిగా రాయడం అవసరం.
నిజాయితీపరులకే ఓటు వేస్తాను..
కొత్తగా ఓటు హక్కును పొందాను. వచ్చే ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా, ప్రజా సమస్యలను పరిష్కరించే అభ్యర్థికి ఓటు వేస్తాను. నోట్లతో ఓట్లను కొనుక్కునే వారు గెలిచిన తర్వాత ప్రజా సమస్యలు విస్మరించి ఎన్నికల్లో పెట్టిన ఖర్చుకు రెండింతలు సంపాదించడానికి అవినీతికి పాల్పడుతారు. అలాంటి వారిని కాకుండా నీతి, నిజాయితీ గల అభ్యర్థులను ఎన్నుకుంటే దేశానికి మేలు.
- కె.రఘురామ్, సివిల్ ఇంజినీర్
ఎలక్షన్ కమిషన్ ఆలోచన బాగుంది
నేను తప్పకుండా దేశాభివృద్ధి కోసం పాటు పడే వారికే ఓటేస్తాను. ఈ దేశ పౌరురాలిగా నా బాధ్యతను నిర్వర్తించి అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహాయ పడతాను. అందరికీ సులభ పద్ధతిలో ఓటర్ ఐడీ వచ్చేలా చేయాలనుకున్న ఎలక్షన్ కమిషన్ ఆలోచన చాలా బాగుంది. ఎలక్షన్ కమిషన్ కొత్తగా తీసుకొచ్చిన సవరణలు కూడా బాగున్నాయి.
- మానసారెడ్డి, ఇంజినీరింగ్ విద్యార్థిని