సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల పరిరక్షణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 363 చోట్ల 412 ఎకరాలు గుర్తించామని, దీని విలువ రూ.7,464 కోట్లు ఉంటుందని కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా జిల్లాలో పరిస్థితిని కలెక్టర్ మీనా వివరించారు. మరో రూ.455 కోట్ల విలువైన స్థలాల విషయంలో న్యాయపరమైన వివాదం ఉందని చెప్పారు. న్యాయపరమైన వివాదాలు ఉన్న స్థలాల విషయంలో కోర్టుల్లో పటిష్టంగా వాదించి, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు సాధించేందుకు ఇద్దరు ముగ్గురు మంచి న్యాయవాదులను నియమించుకునేందుకు అనుమతించాలని కోరారు.
షేక్‌పేట మండలంలో 25 స్థలాలపై న్యాయపరమైన వివాదాలు ఉన్నాయని, ఈ స్థలాల విలువ వేల కోట్లు ఉంటుందని వివరించారు. ‘ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించి నెగ్గాలంటే అది ప్రభుత్వ భూమి అనడానికి అవసరమైన సాక్ష్యాధారాలతో పాటు కోర్టుల్లో సరిగా వాదించే న్యాయవాదులు అవసరమే. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. ఆక్రమితదారులెవరూ భూములను వదులుకోవడానికి సిద్ధపడరు. వాటిని కైవసం చేసుకునేందుకు సుప్రీంకోర్టు వరకైనా వెళ్లడానికి సిద్ధపడతారు.
అందువల్ల మీ జిల్లాల్లోని న్యాయ వివాదాల్లో ప్రభుత్వం తరఫున వాదించడానికి మీ దృష్టిలో ఎవరైనా మంచి న్యాయవాదులు ఉంటే మాకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పిస్తాం..’ అని రాష్ట్ర భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు గాను ప్రహరీల నిర్మాణం, ఫెన్సింగ్ కోసం ఎంత డబ్బు వెచ్చించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే ఎక్కడో ఒకచోట కొంత భూమిని విక్రయించి వచ్చే డబ్బును ఇందుకు వినియోగిస్తామని చెప్పారు.
రూ.7464 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల గుర్తింపు
Published Thu, Sep 26 2013 2:50 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement
Advertisement