
ఇలా చేస్తే మీ లుక్ రెయిన్ బో
చీర, అనార్కలీ, పలోజా ప్యాంట్‌లు, లాంగ్ స్కర్ట్‌లు వేసుకుంటే బాగోదు. తెలుపు, పసుపు.. లాంటి లైట్ కలర్స్ రంగు మారిపోయే ప్రమాదముంది. కాటుక పెట్టుకుంటే కారిపోతుంది. జుట్టు విరబోసుకుంటే తడిచిపోతుంది. ఈ సీజన్‌లో ఏం వేసుకోవాలన్నా.. ఎలా రెడీ కావాలన్నా వరుణ దేవుడికి అడ్వాన్స్‌గా దణ్నం పెట్టుకోవాల్సిందే అనుకుంటాం. అయితే వస్త్రధారణకు ఇన్ని చిక్కులు తెచ్చిపెట్టే వర్షమే.. మనల్ని ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా మార్చేయగలదు. రెయినీ యాక్ససరీస్‌తో డ్రెస్సింగ్‌ని ట్రెండీగా,
వానాకాలానికి ఫ్రెండ్లీగా మార్చేసుకోవచ్చు. - ఓ మధు
అదిరేటి.. అంబ్రెల్లా
గొడుగు వర్షం నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదు. స్టైలిష్ అంబ్రెల్లా మీ స్టైల్‌కి మరింత స్టేటస్‌ని జోడిస్తుంది. వర్షంలో గొడుగు తప్పనిసరి. అయితే నల్ల, తెల్ల గొడుగులు పక్కన పడేద్దాం. రకరకాల డిజైన్స్, ప్యాట్రన్స్‌తో గొడుగులు మార్కెట్లోకి వస్తున్నాయి. నియోన్, ట్రాన్స్‌పరెంట్, బోల్డ్ కలర్స్ గొడుగులు ఎంచుకోండి.
వాతావరణమే.. ఆభరణం
విభిన్న రకాల జువెలరీ వేసుకోవాలంటే ఎండాకాలం మాదిరిగా ఇబ్బంది పెట్టే కాలం కాదిది. కాబట్టి వెరైటీ గొలుసులు, బ్రాస్‌లెట్స్, రింగ్స్ ట్రై చేయొచ్చు. అయితే క్లాత్, పేపర్ మెటీరియల్‌తో తయారు చేసినవి వాడకూడదని వేరేగా చెప్పనక్కర్లేదు. లెదర్, మెటల్ బదులుగా వాటర్ ప్రూఫ్ వాచ్‌లు బెటర్.
చెప్పు కోదగిన ట్రెండ్..
వానాకాలంలో వేసుకునేందుకు ఉపయోగించే ఫుట్‌వేర్‌లో డిఫరెంట్‌గా, ఫంకీగా ఉండేవి మార్కెట్లో ఉన్నాయి. ఫుట్‌పాత్‌ల నుంచి మాల్స్ వరకు రకరకాల ధరల్లో ఇవి దొరుకుతున్నాయి. ఫంకీగా, ఫన్నీగా బొమ్మలు, పువ్వులున్న రబ్బరు చెప్పులు.. కాలి వేళ్లు కనపడేలా ఉండేవి ఎంచుకుంటే మీ పాదాలు కూడా ఫ్యాషన్‌కు ప్రణమిల్లుతాయి.
ఎంత బ్యాగుంటుందో..
మార్కెట్‌లో స్టైలిష్ వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లకు కొదవలేదు. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే చిన్న చిన్న ప్లాస్టిక్ బ్యాగ్‌లు ఎంచుకోవడానికి ఇది సరైన సీజన్. ముదురు రంగుల్లో ఉండే నియోన్ బ్యాగ్ ఈ సీజన్‌కి బాగా సూట్ అవుతుంది. వీటి ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. వర్షంలో ఏ ఇబ్బంది లేకుండా వినియోగించుకోవచ్చు. కలర్‌ఫుల్‌గానూ ఉంటాయి.
హెడ్ మాస్టర్..
టాప్ టు బాటమ్ ఫ్యాషనబుల్‌గా కనిపించడంలో క్యాప్ లేదా హ్యాట్‌ది ముఖ్య పాత్ర. ఇది వర్షంలో తప్పనిదే అయినా మీకు నప్పేది అయితే స్టైలిష్‌గా కనిపించొచ్చు. రెయిన్ కోట్ వేసుకొని, నీటికి తడవని, పాడవని క్యాప్ పెట్టుకుంటే చేతిలో గొడుగు అవసరం ఉండదు, మీ అవుట్‌ఫిట్, నడక సైతం చాలా స్టైల్‌గా మారిపోతాయి.
కోట్ శ్వరులు కండి..
రెయిన్ కోట్స్ వర్షం నుంచి తప్పించేవి మాత్రమే కాకుండా ట్రెండీగా కూడా ఉండేవి ఉంటాయి. ట్రెండీ రెయిన్ కోట్/రెయిన్ ప్రూఫ్ దుస్తులు సిటీ మార్కెట్లో లభిస్తున్నాయి. హూడీస్(టోపీ ఉన్న జాకెట్స్, షర్ట్స్) ఈ సీజన్‌కి అత్యంత ఫ్రెండ్లీ అవుట్ ఫిట్.