ఐఐఎఫ్‌ఎల్ గోల్డు లోన్ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది చేతివాటం...
లక్షలాది రూపాయల స్వాహా: ఖాతాదారుల గగ్గోలు
వనస్థలిపురం: వనస్థలిపురంలోని ఓ గోల్డు లోన్ సంస్థ సిబ్బంది చేతివాటంతో పలువురు ఖాతాదారులు మోసపోయారు. బాధితులు సద రు సంస్థ వద్ద ఆందోళనకు దిగడంతో సిబ్బంది మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వివరాలు... వనస్థలిపురం సుష్మ చౌరస్తా సమీపంలో విజయవాడ జాతీయ రహదారి పక్కన ఐఐఎఫ్‌ఎల్ గోల్డు లోన్ ఫైనాన్స్ సంస్థ కార్యాలయం ఉంది. అయితే ఈ సంస్థలో గోల్డు లోన్ తీసుకుని డబ్బు తిరిగి చెల్లించినా ఇంకా డబ్బు కట్టాలని సంస్థ సిబ్బంది చెప్తున్నారు. దీంతో పలువురు ఖాతాదారులు కొంత కాలంగా ఆ సంస్థ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తున్నారు. అంతర్గత విచారణలో ముగ్గురు సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు రుజువుకావడంతో యాజమాన్యం వారిని డిసెంబర్‌లో తొలగించింది.
ఈ క్రమంలో బుధవారం సయ్యద్ అసద్ ఖాద్రీ అనే వ్యక్తి తాను రెండున్నర తులాల బంగారంపై రూ. 40 వేలు రుణం తీసుకోగా 52 వేలు రుణం తీసుకున్నారంటూ చెప్తున్నారని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సంస్థ ఏరియా మేనేజర్ రాంరెడ్డి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికే గతంలో పనిచేసిన ముగ్గురు సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
ఆ సిబ్బంది ఖాతాదారులకు ఇచ్చిన రుణాలకంటే ఎక్కువ రుణాలిచ్చినట్లు లెక్కల్లో చూపించి ఆ డబ్బు కొట్టేశారని, అలాగే అసలు చెల్లించిన కొందరు ఖాతాదారులకు నగలు తిరిగి ఇవ్వకుండా వాటిని వేరే చోట తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోసపోయిన ఖాతాదారులు ఒక్కొక్కరుగా బయటికి వస్తుండటంతో సంస్థలో లక్షలాది రూపాయల అక్రమాలు జరినట్టు తెలుస్తోంది.
గోల్డ్.. గోల్‌మాల్
Published Wed, Feb 4 2015 11:58 PM | Last Updated on Thu, Aug 2 2018 4:59 PM
Advertisement
Advertisement