పుస్తక కోటి.. ఖరగ్‌పూర్‌ ఐఐటీ! | IIT Kharagpur brings innovative project | Sakshi
Sakshi News home page

పుస్తక కోటి.. ఖరగ్‌పూర్‌ ఐఐటీ!

Published Thu, Sep 21 2017 1:13 AM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM

పుస్తక కోటి.. ఖరగ్‌పూర్‌ ఐఐటీ!

పుస్తక కోటి.. ఖరగ్‌పూర్‌ ఐఐటీ!

ఈపుస్తకాలతో నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు 
ఒకటో తరగతి నుంచి పరిశోధనల వరకు.. చరిత్ర నుంచి టెక్నాలజీ వరకు.. 
70కి పైగా భాషలు.. అన్నీ ఆన్‌లైన్‌లో..  
 
ఉద్యోగ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులైనా.. పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థులైనా.. ఫలానా పుస్తకం దొరకలేదన్న బెంగ అక్కర్లేదు. 
కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉందే..దాన్ని ఇంకొకరికి ఇచ్చేశారు.. చదువుకోవడం ఎలా.. అనే ఆందోళన కాలేజీ విద్యార్థులకు అసలే అవసరం లేదు.. 
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్,రాష్ట్ర సర్వీసు కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన పుస్తకాలను ఎలా కొనాలనే ఆలోచన వద్దు.. 
 
సాక్షి, హైదరాబాద్‌: ఇప్పుడు ఒకటో తరగతి నుంచి పరిశోధనలకు అవసరమైన రిఫరెన్స్‌ పుస్తకాల దాకా అన్నీ ఒకేచోట అందుబాటులో ఉన్నాయి.. ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు.. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.. వీడియోలు చూడవచ్చు.. ఆడియో వినవచ్చు.. పీడీఎఫ్‌ కాపీలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్‌ సదుపాయం. అదొక్కటి ఉంటే ఏ పుస్తకమైనా చదువుకోవచ్చు. సుమారు కోటికిపైగా పుస్తకాలు, ఆర్టికల్స్, రచనలు, వ్యాసాలను ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఆన్‌లైన్‌లో (https://ndl.iitkgp.ac.in/) అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) సహకారంతో నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీని రూపొందించింది. 
 
ఒక్క క్లిక్‌.. సమస్తం కళ్లముందు! 
డిజిటల్‌ పుస్తకాలు, ఆర్టికల్స్, ఇతర అనేక రూపాల్లో ప్రతి ఒక్కరికీ చదువు, సమగ్ర సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌ వినూత్న ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ఒకటో తరగతి నుంచి పరిశోధన విద్యార్థి వరకు.. చరిత్ర నుంచి టెక్నాలజీ వరకు అన్ని సబ్జెక్టులు, అన్ని రంగాలకు చెందిన పుస్తకాలను ఒకే దగ్గరకు చేర్చింది. పైసా చెల్లించనవసరం లేకుండా విద్యార్థులు ఉచి తంగా తీసుకోవచ్చు. సాధారణ గ్రంథాలయాల తరహాలో డిపాజిట్లు అక్కర్లేదు. అవసరమైన పుస్తకాన్ని వెతుక్కునేందుకు ఎక్కువ సమయం అవసరం లేదు.

ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దేశంలోని పలు యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన పుస్తకాలను డిజిటలైజ్‌ చేసి ఈ డిజిటల్‌ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) పుస్తకాలన్నింటిని కంప్యూటరీకరించి అందుబాటులోకి తెచ్చారు. త్వరలో మెుబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు. 
 
రిజిస్ట్రేషన్‌ సులభం 
డిజిటల్‌ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం చాలా సులభం. ఈమెయిల్‌ ఐడీ, చదువుతున్న లేదా చదివిన కోర్సు, వర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్‌ చేస్తే చాలు. ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత ఈమెయిల్‌ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ నమోదు చేసి లైబ్రరీలో లాగిన్‌ కావచ్చు. 
 
డిజిటల్‌ లైబ్రరీ ప్రత్యేకతలెన్నో.. 
⇒ 2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్‌ 
⇒ లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు 
⇒ రాత ప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు 
⇒ 18 వేలకు పైగా ఉపన్యాసాలు 
⇒ 33 వేలకు పైగా గత ప్రశ్నపత్రాలు 
⇒ వర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నపత్రాలు, జవాబులు 
⇒ వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ రంగాల వెబ్‌ కోర్సులు 
⇒ వార్షిక నివేదికలు, 12 వేలకుపైగా వివిధ నివేదికలు 
⇒ సాంకేతిక కోర్సుల నివేదికలు, న్యాయ తీర్పులు 
 
అందుబాటులో ఉన్న ఈపుస్తకాలు 
5,36,487 కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్, ప్రోగ్రామింగ్‌
1,52,340 ఫిలాసఫీ, సైకాలజీ: తత్వశాస్త్రం, మానసిక తత్వశాస్త్రం, అస్తిత్వ, విశ్వ ఆవిర్భావం, లాజిక్, ఎథిక్స్‌ 
1,67,671 మతంతత్వం, మత సిద్ధాంతం, దైవ భావన, సైన్స్‌ అండ్‌ రిలీజియన్‌
ఆర్ట్స్‌.. 1,45,290
లిటరేచర్‌ 4,40,607 
హిస్టరీ  జియోగ్రఫీ 3,65,535 
8,70,802 సోషల్‌ సైన్సెస్‌: సోషియాలజీ,ఆంత్రొపాలజీ, సామాజిక మార్పు,రాజకీయ, అర్థ, న్యాయశాస్త్రాలు,పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, మిలటరీ సైన్స్‌ 
56,17,754 టెక్నాలజీ: వ్యవసాయ టెక్నాలజీ, కెమికల్, సివిల్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ వంటి సాంకేతిక కోర్సుల పుస్తకాలు
22,65,577 నేచురల్‌ సైన్సెస్‌:వైద్యం, ఆరోగ్యం, ఫిజియాలజీ,ఫార్మకాలజీ, థెరపీ, సర్జరీకి సంబంధించిన వైద్య పుస్తకాలు
భాషలు  తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మలయాళం, తమిళ్, గుజరాతీ తదితరాలు, విదేశీ భాషలు  
ఫార్మాట్లు   పీడీఎఫ్, హెచ్‌టీఎల్‌/హెచ్‌టీఎంఎల్, ఎంపీ3/4/ఎంపీఈజీ4, ఎఫ్‌ఎల్‌వీ, డాక్యుమెంట్‌ 
70కి పైగా భాషల్లో..కోటికి పైగా ఈపుస్తకాలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement