నెట్టింట్లోకి పుస్తకం!
నెట్టింట్లోకి పుస్తకం!
Published Wed, Sep 20 2017 9:29 PM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM
► కోటి పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం
► ఖరగ్‌పూర్ ఐఐటీ సాయంతో హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ భారీ కసరత్తు
► ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అన్నిరకాల పుస్తకాలు
► కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. ఓ గ్రంథాలయం ఉన్నట్టే
► దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నేషనల్ డిజిటల్ లైబ్రరీ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులైనా.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులైనా.. ఫలానా పుస్తకం దొరకడం లేదన్న బెంగ అక్కర్లేదు. కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉందే.. దానిని వేరొకరికి ఇచ్చేశారు... ఇక తానెలా చదువుకునేది? అన్న ఆందోళన కాలేజీ విద్యార్థులకు అవసరం లేదు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్ర సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్స్, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు సంబంధించిన రిఫరెన్సు పుస్తకాలను ఎలా కొనాలనే ఆలోచనా వద్దు. ఇప్పుడివన్నీ ఒకేచోటే అందుబాటులోకి వచ్చాయి! ఇవే కాదు.. ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అవసరమైన రిఫరెన్సు పుస్తకాల దాకా అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వాటికి సంబంధించిన వీడియోలు చూడవచ్చు. ఆడియోలను వినవచ్చు. పీడీఎఫ్ కాపీలను కూడా పొందొచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్ సదుపాయం. అదొక్కటి ఉంటే ఏ పుస్తకం అయినా చదువుకోవచ్చు. ఒకటి కాదు.. రెండు కాదు.. కోటికిపైగా పుస్తకాలను, ఆర్టికల్స్, రచనలను, విమర్శనా వ్యాసాలు.. నెట్ ఉంటేచాలు నట్టింట్లో ఉన్నట్లే. ఐఐటీ ఖరగ్‌పూర్ సాయంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ భారీ కసరత్తును చేసింది. https:// ndl. iitkgp. ac. in/ పై క్లిక్ చేసి అవసరమైన పుస్తకాన్ని చదువుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
అదనంగా నయా పైసా ఖర్చులేదు..
ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కటుంటే చాలు... అదనంగా నయాపైసా ఖర్చు లేకుండా డిజిటల్ పుస్తకాలు, ఆర్టికల్స్, వీడియోలు, ఆడియోలు చూడొచ్చు. సాధారణ గ్రంథాలయాల తరహాలో డిపాజిట్లు అక్కర్లేదు. అవసరమైన పుస్తకాన్ని వెతుక్కునేందుకు ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు.
అన్ని రంగాల పుస్తకాలూ..
దేశంలోని పలు యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన పుస్తకాలను డిజిటలైజ్ చేసి ఈ డిజిటల్ గ్రంథాలయంలో ఉంచారు. సాధారణ విద్య నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు.. చరిత్ర నుంచి సాహిత్యం వరకు.. అన్ని రంగాలకు చెందిన పుస్తకాలు డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులే కాదు పరిశోధకులు, పఠనాసక్తి ఉన్నవారు తమకు కావాల్సిన భాషలో డిజిటల్ పుస్తకాలను చదువుకోవచ్చు. ఇంగ్లిషే కాదు.. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) పుస్తకాలన్నింటినీ కూడా కంప్యూటరీకరించి ఇందులో ఉంచారు. అంతేకాదు త్వరలో మెుబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
డిజిటల్ లైబ్రరీ ప్రత్యేకతలు ఎన్నెన్నో...
► 70కి పైగా భాషల్లో... కోటికి పైగా ఈ–పుస్తకాలు
► 2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్
► లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు
► రాతప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు
► 18 వేలకు పైగా వీడియో ఉపన్యాసాలు
► 33 వేలకు పైగా గత ప్రశ్నాపత్రాలు
► యూనివర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నాపత్రాలు, జవాబులు
► వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ రంగాల వెబ్ కోర్సులు
► సమాచార నిధి, వార్షిక నివేదికలు, 12వేలకుపైగా వివిధ నివేదికలు
► సాంకేతిక కోర్సుల నివేదికలు, న్యాయ తీర్పులు
పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారికి ప్రయోజనం ఎంతో...
పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులకు ఈ డిజిటల్ లైబ్రరీతో ఎంతో ప్రయోజనం చేకూరనుంది. గత పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు? వాటిని ఎలా పరిష్కరించారో తెలుసుకోÐèవచ్చు. అయితే వాటికి సంబంధించి మార్కెట్‌లో ఉన్న పుస్తకాలను కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక్క క్లిక్‌తో వాటిని పొందవచ్చు.
రిజిస్ట్రేషన్ సులభం
డిజిటల్ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం చాలా సులభం. ఈ–మెయిల్ ఐడీ, తాము చదువుతున్న కోర్సు, యూనివర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేస్తే చాలు. ఈ వివరాలను నమోదు చేసిన తరువాత తాము పేర్కొన్న ఈ–మెయిల్ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తరువాత ఈ–మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ నమోదు చేసి లైబ్రరీలో లాగిన్ కావచ్చు. విద్యార్థులు, అభ్యర్థులు తమకు అవసరమైన విభాగాల వారీగా పుస్తకాలు, వీడియో, ఆడియో పాఠాలు, లెక్చర్లు, ఉపన్యాసాలు వెతికి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Advertisement
Advertisement