Sid Farm Success Story In Telugu: ఇంటెల్‌లో జాబ్‌ వదిలి.. - Sakshi
Sakshi News home page

ఇంటెల్‌లో జాబ్‌ వదిలి.. 20 ఆవులతో మొదలై.. రూ. 44 కోట్ల సంపాదన

Published Tue, May 18 2021 7:05 PM | Last Updated on Wed, May 19 2021 3:06 PM

Karnataka IIT Graduate Quit His US Job to Buy 20 Cows Now Earns Rs 44 Crore - Sakshi

ఇంటెల్‌లో కొలువు వదిలేసుకుని వచ్చి డెయిరీ ఫామ్‌ ప్రారంభించిన కిశోర్‌ ఇందుకూరి

బెంగళూరు: మన పెద్దలు ఓ మాట చెప్తుంటారు. బుర్ర చెప్పింది వింటే బాగుంటాం.. మనసు చెప్పింది వింటే సంతోషంగా, సంతృప్తిగా బతుకుతామని. ఈ మాటని నిజం చేసి చూపాడు ఓ వ్యక్తి. ఐఐటీలో చదివి.. ప్రతిష్టాత్మక ఇంటెల్‌ కంపెనీలో కొలువు చేస్తున్న ఓ ఇంజనీర్‌ దాన్ని వదిలేసుకుని.. తనకు ఎంతో ఇష్టమైన పని చేయడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం అతడు సంతృప్తిగా బతకడమే కాక మరో 100 మందికి పైగా ఉపాధి చూపుతున్నాడు. ఇంతకు అతడు ఏం చేస్తున్నాడంటే.. ఉద్యోగం వదిలి 20 ఆవులతో పాల వ్యాపారం ప్రారంభించి, ఇప్పుడు ఏకంగా ఏడాదికి 44 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. అతడి విజయ గాథ వివరాలు.. 

కర్ణాటకకు చెందిన కిశోర్‌ ఇందుకూరి అనే వ్యక్తి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో మాస్టర్స్‌, పీహెచ్‌డీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇంటెల్‌ కంపెనీలో ఆరేళ్లు పని చేశాడు. ఉద్యోగంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికి అతడికి సంతృప్తి లేదు. దాంతో ఇండియాకు తిరిగి వచ్చాడు. అప్పుడే అతడి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. 

ఓ సారి పని నిమిత్తం కిశోర్‌ హైదరాబాద్‌ వచ్చాడు. ఆ సమయంలో అతడు నగరవాసులు స్వచ్ఛమైన పాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారని గ్రహించాడు. ఆ సమయంలో కిశోర్‌కి వచ్చిన ఓ ఆలోచన అతడి జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పింది. దానిలో భాగంగా కిశోర్‌ జాబ్‌ వదిలేసి 20 ఆవులు కొని సొంత డెయిరీ ప్రారంభించాడు. కుటుంబ సభ్యులతో కలిసి స్వచ్ఛమైన పాలను వినియోగదారుల గుమ్మం వద్దకే తీసుకెళ్లసాగాడు. ఇక పాలు ఎక్కువ సమయం నిల్వ ఉండేలా చల్లబర్చి, నిల్వ చేసే విధానాన్ని ఉపయోగించాడు కిశోర్‌. 

అంచెలంచెలుగా ఎదుగుతూ, 2018 నాటికి డెయిరీ విస్తరించింది. దానికి తన కుమారుడు సిద్దార్థ్ పేరు మీద “సిద్‌ ఫార్మ్” అని పేరు పెట్టాడు కిశోర్‌. ప్రస్తుతం అతడు 6 వేల మందికి పాలు పోస్తున్నాడు. ఇక షాబాద్‌లో విస్తరించిన ఇతడి ఫామ్‌లో ప్రస్తుతం 120 మంది పని చేస్తున్నారు. ఇక కిశోర్‌ కేవలం పాలు మాత్రమే కాక సేంద్రీయ పాల ఉత్పత్తులైన పెరుగు, నెయ్యిని విక్రయిస్తాడు. సిద్‌ ఫామ్ ఇప్పుడు రోజుకు దాదాపు 10,000 మంది వినియోగదారులకు తన ఉత్పత్తులను అందిస్తుంది. ఇక ఈ డెయిరీ మీద అతడు సంవత్సరానికి 44 కోట్లు ఆర్జిస్తున్నాడు. 

చదవండి: 67 ఏళ్ళ వయసులో ‘గేట్’‌ సాధించాడు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement