అదనంగా రూ.300 కోట్ల ‘ఉపాధి’ నిధులు
♦ 100 రోజుల పని పూర్తిచేసిన కుటుంబాలు 4 లక్షలున్నట్లు గుర్తింపు
♦ రెండు కోట్ల పనిదినాలు కల్పించేందుకు కేంద్రం అంగీకారం
♦ ఉపాధి హామీ కిందే అంగన్‌వాడీలకు సొంత భవనాల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద రాష్ట్రానికి రూ. 300 కోట్లు అదనంగా అందనున్నాయి. ఏడు జిల్లాల్లో 231 మండలాలను సర్కారు ఇటీవల కరువు మండలాలుగా ప్రకటించడంతో ఆయా మండలాల్లో అదనపు ఉపాధికి (100 రోజుల ఉపాధి పనులు పూర్తి చేసిన కుటుంబాలకు) 4 లక్షల కుటుంబాలు అర్హత కలిగి ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి విభాగం అధికారులు గుర్తించారు. ఒక్కో కుటుంబానికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే అదనంగా 50 రోజుల చొప్పున 4 లక్షల కుటుంబాలకు 2 కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉందని కేంద్ర గామీణాభివృద్ధిశాఖకు ప్రతిపాదనలు పంపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం అదనపు ఉపాధి కింద రూ. 300 కోట్లు రాష్ట్రానికి ఇచ్చేందుకు అంగీకరించింది.
ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శి అపరాజిత సారంగి...రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు తాజాగా లేఖ రాశారు. అదనపు ఉపాధి కింద కేంద్రం విడుదల చేయనున్న రూ. 300 కోట్లలో కూలీలకు వేతనంగా రూ. 200 కోట్లు, మెటీరియల్ కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం సూచించినట్లు తెలిసింది. వంద రోజుల పని పూర్తి చేసిన వారి సంఖ్య భవిష్యత్తులో పెరిగితే తదనుగుణంగా మరిన్ని నిధులు విడుదల చేసేందుకు సిద్ధమని లేఖలో అపరాజిత పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు ఉపాధి హామీ నిధులతోనే సొంత భవనాలను సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తొలి దశలో భవన నిర్మాణాలను చేపట్టేందుకు 1,064 అంగన్‌వాడీ కేంద్రాలను స్త్రీ, శిశుసంక్షేమశాఖ అధికారులు ఎంపిక చేశారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ. 8 లక్షల చొప్పున మొత్తం 85.12 కోట్లు అవసరమని ప్రతిపాదనలను గ్రామీణాభివృద్ధి విభాగానికి పంపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధి హామీ కింద ఒక్కో అంగన్‌వాడీ కేంద్రానికి రూ. 5 లక్షలు మాత్రమే వెచ్చేందుకు వీలుందని, ఈ మేరకు రూ. 53.20 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఒక్కో అంగన్‌వాడీ భవనానికి రూ. 5 లక్షల చొప్పున ఉపాధి హామీ నిధులుపోను మిగిలిన మొత్తం (రూ. మూడు లక్షలు చొప్పున) రూ. 31.92 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉందని వారు పేర్కొన్నారు.