Central Rural Development
-
రూ.152 కోట్లు వెంటనే చెల్లించండి!
సాక్షి, హైదరాబాద్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీపథకం నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర పనులకు వినియోగించారంటూ రాష్ట్రానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ పథకం కింద అనుమతించని పనులు చేపట్టినందుకు, నిధులు దారి మళ్లించినందుకు ఈ నెల 30వ తేదీలోగా కేంద్రానికి రూ.151.9 కోట్లు తిరిగి చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ నోటీసులకు స్పందించకపోయినా, దారి మళ్లించిన మేర నిధులు తిరిగి కేంద్రానికి చెల్లించక పోయినా తదుపరి ఉపాధి నిధులు విడుదల చేయబోమని స్పష్టంచేసినట్టు సమాచారం. అదేవిధంగా ఇకపై భూమి అభివృద్ధి పనులకు సంబంధించి అన్నింటికీ ఒకేవిధమైన అనుమతి (బ్లాంకెట్ పర్మిషన్ ఫర్ ల్యాండ్ డెవలప్మెంట్) జారీచేయొద్దని రాష్ట్రానికి సూచించినట్టు తెలుస్తోంది. ఇవీ ఉల్లంఘనలు..? మార్గదర్శకాలకు భిన్నంగా ఆయా పనుల అంచనావ్యయం, వాటికి ఆమోదం, ధాన్యం ఆరబెట్టే కల్లాల నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో పూడికతీత, అటవీ ప్రాంతాల్లో ‘స్టాగర్డ్ ట్రెంచేస్’తదితర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు వినియోగించినట్లు ఆ నోటీసుల్లో పేర్కొన్నారని సమాచారం. ఉన్నతస్థాయి సాంకేతిక బృందం (సుపీరియర్ టెక్నికల్ అథారిటీ) ఆమోదం పొందాల్సిన పరిధి నుంచి తప్పించేందుకు అధిక వ్యయమయ్యే వివిధ పనులను చిన్నచిన్న పనులుగా విభజించడం, పనులు చేపట్టడానికి ముందు, ఆ తర్వాత కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ బోర్డుల ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన, జాబ్‌కార్డుల నిర్వహణ, గ్రామపంచాయతీల్లో ఆయా పనులకు సంబంధించిన డాక్యుమెంటేషన్, వాటి నిర్వహణ వంటి అంశాల్లో లోపాలు చోటుచేసుకున్నట్టు గుర్తించారు. తెలంగాణలోని కొన్ని బ్లాక్‌లలో అత్యధికంగా ఉపాధి హామీ నిధుల వెచ్చింపు జరుగుతున్నట్టు కేంద్రం దృష్టికి రాగా గత జూన్, సెప్టెంబర్లలో వివిధ జిల్లాల్లో ఈ పనుల క్షేత్రస్థాయి పరిశీలనకు పలు బృందాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిశీలన అనంతరం ఆయాజిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా వివిధ పనులు చేపట్టారంటూ, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు పంపించాల్సిందిగా గతంలోనే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి లేఖలు వచ్చాయని తెలుస్తోంది. ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’లు అడిగారు ఇదిలా ఉండగా రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చినవి నోటీసులు కావని, గతంలో లేవనెత్తిన అంశాలకు సంబంధించి ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’లు, ఇతర వివరణలు మాత్రమే అడిగారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు సాక్షికి తెలిపారు. ఇదిలా ఉంటే కేంద్రం నుంచి వచ్చిన తాఖీదులపై రాష్ట్ర పీఆర్ శాఖలో ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూసే ఓ అధికారి తాజాగా ఢిల్లీ వెళ్లి వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా, పనుల్లో తేడాలకు సంబంధించి పూర్తి నివేదికలు సిద్ధంగా ఉంచాలని కేంద్రం ఆదేశించినట్టు తెలుస్తోంది. మరో పక్క ఈ వివరాలను తాము ఇప్పటికే సమర్పించినట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ఆయా పనుల నిర్వహణలో నిధుల దుర్వినియోగం జరగలేదని, సాంకేతిక పరమైన ఏవైనా అంశాలు ఉంటే పాటించకపోవడం వంటిదే జరిగిందని వారు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఉపాధి నిధులు నిలిపేసేంత స్థాయిలో ఈ పథకం అమల్లో ఉల్లంఘనలు జరగలేదని అధికారులు చెపుతున్నారు. -
దేశ వ్యాప్తంగా ఆర్బీకేలు
సాక్షి, అమరావతి: వ్యవసాయంలో రైతన్నలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించేందుకు, నాణ్యమైన ఇన్పుట్స్, సాగుకు సంబంధించి అన్ని రకాల ఇతర సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అద్భుత వ్యవస్థ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు). రాష్ట్ర వ్యవసాయ రంగంలో అత్యున్నత ఫలితాలు ఇస్తున్న ఈ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఇప్పటికే ఇథియోపియా దేశం రాష్ట్ర అధికారుల సహకారం తీసుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆ రాష్ట్రాల అధికార బృందాలు రాష్ట్రానికి వచ్చి ఆర్బీకేలు, డిజిటల్ కియోస్క్‌లపై అధ్యయనం చేశాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తరహా వ్యవస్థను దేశవ్యాప్తంగా నెలకొల్పడానికి చర్యలు చేపట్టింది. బుధవారం న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ–పూస)లో ప్రారంభమైన మూడు రోజుల 5వ ఇండియా అగ్రి బిజినెస్ సమ్మిట్–2022 సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ విషయం చెప్పారు. సదస్సులో భాగంగా నిర్వహించిన జాతీయ అగ్రి ఎక్స్‌పోలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ఆర్బీకేల నమూనా, డిజిటల్ కియోస్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్బీకే ద్వారా అందిస్తున్న సేవలు, డిజిటల్ కియోస్క్‌ల పనితీరును కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్‌తో పాటు ఫిలిప్పైన్స్ వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి విలియం దార్, రోమన్ ఫోరమ్ ప్రెసిడెంట్ మహారాజ్ ముతూ, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్, సలహాదారు ఎన్కే దడ్లాని, నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథారిటీ (ఎన్ఆర్ఏఏ) సీఈవో అశోక్ దాల్వాయి తదితరులు అడిగి తెలుసుకున్నారు. ఆర్బీకేల ద్వారా ఏపీ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఆర్బీకే సేవలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, ఇదే తరహా సేవలను దేశవ్యాప్తంగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చెప్పారు. ఆర్బీకేలు, వాటిలోని కియోస్క్‌లు వ్యవసాయ రంగంలో విప్లవం తీసుకొచ్చే వినూత్నమైన పరిజ్ఞానమని ఆయన కొనియాడారు. ‘ఏపీ ఆర్బీకేల గురించి చాలా వింటున్నాం. వాటి ద్వారా అందిస్తున్న సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్బీకేల్లో డిజిటల్ కియోస్క్‌ల ద్వారా ఇన్పుట్స్ బుకింగ్ విధానం అద్భుతం. వాటిని జాతీయ స్థాయిలో రైతులకు అందుబాటులోకి తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో వీటిని గ్రామ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తా’ అని చెప్పారు. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని, డిసెంబరుకల్లా డిజిటల్ కియోస్క్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సదస్సుకు వచ్చిన మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైతు ముంగిటకే విత్తన సరఫరా భేష్ కేంద్ర మంత్రి సంజీవ్‌కుమార్ బల్యాన్, నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్‌చంద్ ప్రశంసలు నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను గ్రామ స్థాయిలో రైతుల ముంగిటకే అందించడం వినూత్న ఆలోచన అని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖల సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్, నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) రమేష్ చంద్ ప్రశంసించారు. విత్తన పంపిణీలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని చెప్పారు. మూడేళ్లలో 50.95 లక్షల మందికి 34.97 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అత్యంత పారదర్శకంగా పంపిణీ చేయడం నిజంగా గొప్ప విషయమన్నారు. వ్యవసాయ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన సంస్థలకు ఇండియన్ చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) ఏటా అందించే ఇండియా అగ్రి బిజినెస్ అవార్డుల్లో విత్తన పంపిణీ కేటగిరీలో ఏపీ సీడ్స్‌కు గ్లోబల్ అగ్రి అవార్డును అందించింది. బుధవారం జరిగిన ఇండియా అగ్రి బిజినెస్ సమ్మిట్‌లో ఈ అవార్డును సంజీవ్‌కుమార్ బల్యాన్, రమేష్‌చంద్ చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ పి.హేమసుష్మిత, ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తన పంపిణీలో ఏపీ అనుసరిస్తున్న విధానాన్ని జాతీయ స్థాయిలో అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ఇదే ఆలోచనతో కేంద్రం పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను తీసుకొచ్చిందని చెప్పారు. మిగతా రాష్ట్రాలు కూడా ఏపీ బాటలోనే విత్తన పంపిణీని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పంతోనే.. విత్తు నుంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా అందిస్తున్న సేవలను రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య సదస్సులో వివరించారు. పౌర సేవలు ప్రజల గుమ్మం వద్ద అందించాలన్న సంకల్పంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సచివాలయ, ఆర్బీకే వ్యవస్థలను తీసుకొచ్చారని చెప్పారు. ఆర్బీకేల్లోని డిజిటల్ కియోస్క్‌ల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను బుక్ చేసుకున్న గంటల్లోనే రైతుల ముంగిట అందిస్తున్నామని చెప్పారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలు, నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో గోదాములతో పాటు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఎకరాలో సాగయ్యే పంటల వివరాలను ఈ– క్రాప్ ద్వారా నమోదు చేయడం, ఈ డేటా ఆధారంగా పైసా భారం పడకుండా పంటల బీమా, పెట్టుబడి రాయితీ, సున్నా వడ్డీ పంట రుణాలు వంటి సంక్షేమ ఫలాలు రైతులకు అందిస్తున్నామని వివరించారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ఆర్బీకే స్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా కూడా మార్చి, గ్రామస్థాయిలోనే పంట ఉత్పత్తులు కొంటున్నామన్నారు. ఆర్బీకేల సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు పలు రాష్ట్రాలతో పాటు ఇథియోపియా వంటి ఆఫ్రికన్ దేశం కూడా ముందుకొచ్చిందని వివరించారు. ఆసక్తిగా విన్న పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఆర్బీకేల పని తీరును మరింత లోతుగా రాష్ట్ర అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సదస్సులో ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, మచిలీపట్నం ఎంఏవో జీవీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: మానవాళికి పెనుసవాల్‌గా పరిణమించిన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర గ్రామీణ, పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శులు రాజేశ్ భూషణ్, సునీల్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కరోనా నియంత్రణలో గ్రామ పంచాయతీల పాత్ర కీలకమని, ఇందులో పంచాయతీరాజ్ వ్యవస్థలోని మూడంచెల ప్రజాప్రతినిధులు, అన్ని విభాగాల ప్రతినిధులను భాగస్వా మ్యం చేయాలని సూచించారు. లాక్డౌన్ రోజుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూడాలన్నారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని.. కూరగాయలు, పాల దుకాణాలు, షాపులు, బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోలు పంపులు, వంట గ్యాస్ కేంద్రాల్లో సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామా ల్లో కొత్తవారెవరైనా వచ్చి నా, విదేశాల నుంచి పౌరు లు వచ్చినా తక్షణమే ఆ సమాచారాన్ని స్థానిక పాలనా వ్యవస్థతో పంచుకోవాలని సూచించారు. కరోనా వైరస్ లక్షణాలతోబాధపడుతున్నట్లు గుర్తిస్తే వెంట నే ఆస్పత్రులకు లేదా స్వీయ నిర్బంధం చేయాలన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని చెప్పారు. -
‘ఉపాధి’ పర్యవేక్షణలో తెలంగాణ భేష్
సాక్షి, అమరావతి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయిలోనూ మెరుగైన పర్యవేక్షణ కొనసాగిస్తోందని, పరిపాలన పరమైన ఉత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలూ ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అపరాజిత సారంగి సోమవారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఉపాధి పథకం మరింత పారదర్శకంగా అమలు చేసేందకు పథకంలో చేపట్టిన పనుల వివరాలను ఆయా గ్రామాల్లో ఒక గోడపై అందరికీ తెలిసేలా రాయడం.. ప్రతి గ్రామ పంచాయతీలో పనులపై ఏడు రిజిస్టర్లను నిర్వహించడం, జాబ్‌కార్డుల జాబితాను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం వంటి అంశాలపై స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అమలు చేయాల్సిన విధానాలపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కొద్ది రోజుల కిత్రం అన్ని రాష్ట్రాల అధికారులతో ఢిల్లీలో సమావేశం కూడా నిర్వహించింది. జిల్లా, బ్లాక్ లేదా మండల స్థాయిలో ఆయా అంశాలను సమర్ధవంతంగా అమలుకు కేంద్రం చేసిన సూచనలను పాటించడంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మెచ్చుకుంది. అన్ని రాష్ట్రాలూ తెలంగాణ చేపట్టిన చర్యలను పరిశీలించి, పాటించాలని సూచించింది. -
ఉపాధి కూలీల వేతనం పెంపు
ఏపీ, తెలంగాణల్లో రూ.3 పెరిగిన కూలీ సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ‘ఉపాధి హామీ’ కూలీలకు చెల్లించే వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ పెంపు రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉంది. ఏపీ, తెలంగాణల్లో కూలీలకు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రోజుకు గరిష్టంగా రూ.194 వేతనంగా చెల్లిస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.197కు పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ వేతనాలు అమల్లోకి రానున్నాయి. -
అదనంగా రూ.300 కోట్ల ‘ఉపాధి’ నిధులు
♦ 100 రోజుల పని పూర్తిచేసిన కుటుంబాలు 4 లక్షలున్నట్లు గుర్తింపు ♦ రెండు కోట్ల పనిదినాలు కల్పించేందుకు కేంద్రం అంగీకారం ♦ ఉపాధి హామీ కిందే అంగన్వాడీలకు సొంత భవనాల నిర్మాణం సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద రాష్ట్రానికి రూ. 300 కోట్లు అదనంగా అందనున్నాయి. ఏడు జిల్లాల్లో 231 మండలాలను సర్కారు ఇటీవల కరువు మండలాలుగా ప్రకటించడంతో ఆయా మండలాల్లో అదనపు ఉపాధికి (100 రోజుల ఉపాధి పనులు పూర్తి చేసిన కుటుంబాలకు) 4 లక్షల కుటుంబాలు అర్హత కలిగి ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి విభాగం అధికారులు గుర్తించారు. ఒక్కో కుటుంబానికి ఈ ఆర్థిక సంవత్సరంలోనే అదనంగా 50 రోజుల చొప్పున 4 లక్షల కుటుంబాలకు 2 కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉందని కేంద్ర గామీణాభివృద్ధిశాఖకు ప్రతిపాదనలు పంపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం అదనపు ఉపాధి కింద రూ. 300 కోట్లు రాష్ట్రానికి ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శి అపరాజిత సారంగి...రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు తాజాగా లేఖ రాశారు. అదనపు ఉపాధి కింద కేంద్రం విడుదల చేయనున్న రూ. 300 కోట్లలో కూలీలకు వేతనంగా రూ. 200 కోట్లు, మెటీరియల్ కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం సూచించినట్లు తెలిసింది. వంద రోజుల పని పూర్తి చేసిన వారి సంఖ్య భవిష్యత్తులో పెరిగితే తదనుగుణంగా మరిన్ని నిధులు విడుదల చేసేందుకు సిద్ధమని లేఖలో అపరాజిత పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు ఉపాధి హామీ నిధులతోనే సొంత భవనాలను సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో భవన నిర్మాణాలను చేపట్టేందుకు 1,064 అంగన్వాడీ కేంద్రాలను స్త్రీ, శిశుసంక్షేమశాఖ అధికారులు ఎంపిక చేశారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ. 8 లక్షల చొప్పున మొత్తం 85.12 కోట్లు అవసరమని ప్రతిపాదనలను గ్రామీణాభివృద్ధి విభాగానికి పంపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధి హామీ కింద ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి రూ. 5 లక్షలు మాత్రమే వెచ్చేందుకు వీలుందని, ఈ మేరకు రూ. 53.20 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఒక్కో అంగన్వాడీ భవనానికి రూ. 5 లక్షల చొప్పున ఉపాధి హామీ నిధులుపోను మిగిలిన మొత్తం (రూ. మూడు లక్షలు చొప్పున) రూ. 31.92 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉందని వారు పేర్కొన్నారు.