చట్టాలను ఉల్లంఘిస్తున్న సింగరేణి
‘ఓసీ’ నిర్వాసితులకు వైఎస్సార్‌సీపీ అండ: పొంగులేటి
ఇల్లెందు: ఓపెన్‌కాస్టు నిర్వాసితుల విషయంలో సింగరేణి చట్టాలను ఉల్లంఘిస్తోందని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపిం చారు. ఇల్లెందు ఏరియా జేకే-5 ఓసీ నిర్వాసితుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అసెంబ్లీలో, తాను వచ్చే నెల 21న జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. ఓసీ నిర్వాసితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
జేకే-5 ఓసీ నిర్వాసితులు చేపట్టిన రెండురోజుల దీక్షను బుధవారం పొంగులేటి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. సింగరేణి ఓసీ నిర్వాసితుల సమస్యలపై వైఎస్సార్‌సీపీ కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. నష్టపోయిన నిర్వాసితులకు యాజమాన్యం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇల్లెందులోని 19, 20, 21 వార్డుల్లో పలువురు నిర్వాసితులకు పరిహారం అందలేదన్నారు.
పరిహారం ఇప్పిస్తామంటూ తమ వద్ద లం చాలు తీసుకున్నారని మహిళలు ఎంపీకి ఫిర్యాదు చేశారు. డబ్బులు వసూలు చేసిన వారి పేర్లను లిఖితపూర్వకంగా ఇస్తే జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఓసీ నిర్వాసితుల సమస్యలపై రెండురోజుల్లో కలెక్టర్‌ను కలుస్తానని తెలిపారు.
మంత్రులకు ‘ఉపాధి’ సిబ్బంది సమ్మె సెగ
కరీంనగర్: కరీంనగర్ లో హరితహారం, పుష్కరాల పనులపై సమీక్షించేందుకు బుధవారం ఇక్కడికి వచ్చిన రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జోగు రామన్నలకు ఉపాధిహామీ కాంట్రాక్ట్ సిబ్బంది సమ్మె సెగ తగిలింది. కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న సిబ్బంది కేటీఆర్‌ను కలసి తమను రెగ్యులరైజ్ చేయాలని, అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ ఉపాధిహామీ కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మనెంట్ చేయడం సాధ్యం కాదని, జీతాలు పెంచేందుకు పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
ఉపాధిహామీ సిబ్బంది సమ్మె ప్రభావం హరితహారంపై పడనీయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో సమ్మె విరమణకు స్పష్టమైన సందేశమివ్వలేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు మండిపడ్డారు. మంత్రుల కాన్వాయ్‌లను రెండుసార్లు అడ్డుకునేందుకు యత్నించారు.