
ఆగని ‘సాఫ్ట్‌వేర్’ మోసాలు
మొన్న సోమాజిగూడలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరుతో మోసం..తాజాగా నారాయణగూడలో ఓ కన్సల్టెన్సీ వంచన. నిరుద్యోగుల అమాయకత్వాన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.
హిమాయత్‌నగర్, న్యూస్‌లైన్: మొన్న సోమాజిగూడలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరుతో మోసం..తాజాగా నారాయణగూడలో ఓ కన్సల్టెన్సీ వంచన. నిరుద్యోగుల అమాయకత్వాన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆకర్షణీయమైన భవనం, ఫర్నీచర్, కంప్యూటర్లు ఏర్పాటు చేసి, మంచి వేతనాలిప్పిస్తామంటూ డిపాజిట్ల పేరుతో రూ.కోట్లకు టోపి పెడుతున్నారు.
చివరకు బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నారాయణగూడ ఎస్సై డేనియేల్ కథనం ప్రకారం..సతీష్ అనే వ్యక్తి హిమాయత్‌నగర్ 18వ వీధి వద్ద ఉన్న ఓ బిల్డింగ్‌లో ‘హెచ్‌ఆర్ ఈ-సాల్వ్ సొల్యూషన్స్’ పేరుతో కన్సల్టెన్సీని ఏర్పాటు చేశాడు. టీసీఎస్ లాంటి పెద్దపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలు రకాలు ప్రచారం చేసుకున్నాడు.
ఇతనికి గోపాల్ అనే వ్యక్తి సహాయంగా ఉండేవాడు. సంస్థ ప్రచారాన్ని నిజమని నమ్మిన పలువురు నిరుద్యోగులు ఆశ్రయించగా.. వారి వద్ద నానాహంగామా చేసి ‘మీ బయోడేటాలను సదరు కంపెనీలకు పంపుతున్నాము, మీకు ఉద్యోగం ఖాయం, రెండు నెలల్లో భారీ వేతనం అందుకోబోతున్నారని’ నమ్మించేవారు. వారి ముందే ఆయా సాఫ్ట్‌వేర్ కంపెనీలకు మెయిల్స్ కూడా పంపేవారు. వీటిని నమ్మిన పలువు రు లక్షా 20వేల నుంచి లక్షన్నర వరకు హెచ్‌ఆర్ ఈ-సాల్వ్ యాజమాన్యానికి చెల్లించారు.
సంస్థ మా టలు నిజమని నమ్మిన నిరుద్యోగులు వారు చెప్పిన తేదీల్లో ఆయా కంపెనీలకు వెళ్లగా ‘ఈ-సాల్వ్’ సంస్థకు మాకెలాంటి సంబంధం లేదని చెప్పడంతో మోసం బయటపడింది. కొద్దిరోజులుగా బాధితుల ఒత్తిడి పెరగడంతో సంస్థ రాత్రికి రాత్రి బిచాణా ఎత్తివేసింది. బాధితులకు సుమారు రూ.50లక్షల వరకు సంస్థ కుచ్చుటోపీ పెట్టినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌కు చెందిన ఫజియుద్దీన్‌తోపాటు పలువురి ఫిర్యాదుమేరకు పోలీసులు కే సు నమోదు చేసి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
కటకటాల్లోకి ‘సాఫ్ట్’ మోసగాళ్లు
శ్రీనగర్‌కాలనీ: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చి, పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసి మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ మోహన్‌కుమార్ వివరాల ప్రకారం..తమిళనాడుకు చెందిన సంతాన కృష్ణ చాలాకాలం క్రితం నగరానికి వచ్చి సోమాజిగూడలోని ఓ భారీ భవనంలో డిస్ట్రీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సంస్థను ఏర్పాటు చేశాడు.
అందులో నగరానికి చెందిన ఉదయ్‌భాస్కర్‌ను హెచ్‌ఆర్ మేనేజర్‌గా నియమించుకొని ఇద్దరు కలిసి ఉన్నత చదువులు చదవి ఉద్యోగవేటలో ఉన్న నిరుద్యోగులను టార్గెట్ చేసుకున్నారు. తమ సంస్థలో శిక్షణ తీసుకుంటే పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయని..ఒకవేళ రాకపోయినా తమ వద్దే ఉద్యోగం కల్పిస్తామని ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర వరకు తీసుకున్నారు. మూడునెలల వరకు స్టైఫండ్ చెల్లించిన కృష్ణ నాల్గోనెల నుంచి ముఖం చాటేయడంతో పలువురు ఒత్తిడి చేశారు. పథకం ప్రకారం ఈనెల 24న రాత్రికిరాత్రే సంస్థలోని కంప్యూటర్లు, ఫర్నీచర్ తీసుకొని ఉడాయించారు. నిరుద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టి సంతాన కృష్ణ, హెచ్‌ఆర్ మేనేజర్ ఉదయ్‌కుమార్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.