=భారీ శబ్దాలు వెలువడే సామగ్రిని అధికంగా కాల్చిన సిటీజనులు
=పెరిగిన దీపావళి ధ్వని కాలుష్య ప్రమాణాలు
సనత్‌నగర్, న్యూస్‌లైన్ : ఢాం... ధన్... ధనాధన్... పేలుళ్లు, శబ్దాలతో నగరం మోతెక్కి పోయింది. ఈ దీపావళికి టపాసుల ధరలే కాదు.. ధ్వని కాలుష్య ప్రమాణాలూ కాస్త పైకి ఎగబాకాయి. బాణాసంచా ధరలు పెరిగినా టపాసుల మోత మాత్రం తగ్గలేదని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ధరలు పెరగడంతో కొనుగోళ్లు తక్కువగా జరిగినప్పటికీ... శబ్దాలు ఎక్కువగా వెలువడే టపాసులకు నగరవాసులు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. పీసీబీ అధికారుల లెక్కల ప్రకారం గత ఏడాది దీపావళితో పోలిస్తే ఈ సారి ఒక డెసిబల్ నుంచి 13 డెసిబల్స్ మేర ధ్వని కాలుష్య ప్రమాణాలు పెరిగాయి.
అయితే పీసీబీ అధికారులు మాత్రం దీనికి మరోభాష్యం చెబుతున్నారు. గత ఏడాది వర్షాలు పడిన నేపథ్యంలో వాతావరణంలో తేమశాతం అధికంగా ఉండి టపాసులు మోత అక్కడికక్కడే ఉండిపోయిందని, అందుకే ప్రమాణాలు తక్కువగా నమోదయ్యాయని వివరిస్తున్నారు. ఈసారి వాతావరణం అందుకు భిన్నంగా పొడిగా ఉండడంతో శబ్దాల తీవ్రత అధికంగా నమోదు అయినట్లు చెబుతున్నారు.
ఈ దీపావళికి సిటీలోని రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్, కమర్షియల్ ప్రాంతాల్లోని శబ్ద కాలుష్య ప్రమాణాలు ఎలా ఉన్నాయో పీసీబీ నమోదు చేసింది.
వాటిని సోమవారం విడుదల చేసింది. కూకట్‌పల్లి జేఎన్టీయూ ఎదురుగా గల ప్రగతినగర్‌లో గత సంవత్సరం అత్యధికంగా 99 డెసిబల్స్ నమోదు కాగా ఈసారి అత్యధికంగా 112 డెసిబల్స్‌కు చేరింది. నగర శివారు ప్రాంతమైన ప్రగతినగర్‌లోనే ఈ విధంగా ఉంటే కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్ వంటి రెసిడెన్షియల్ ప్రాం తాల్లో మరింత ఎక్కువగా నమోదై ఉంటు ందని పీసీబీ అధికారులే చెబుతున్నారు. ఇక ఇండస్ట్రీయల్ ఏరియాకు సంబంధించి ఉప్పల్‌లో నమోదు చేయగా రెండు డెసిబల్స్ మేర పెరిగాయి. అలాగే వాణిజ్య ప్రాంతమైన ప్యారడైజ్‌లో ఒక డెసిబల్ పెరిగింది.
కాలుష్యంపై స్పృహ పెరిగిందా...?
రికార్డుల ప్రకారం శబ్దకాలుష్యంలో పెరుగుదల కనిపించినా... వాతావరణంలో వ్యత్యాసాన్ని పరిగణలోనికి తీసుకుంటే గత ఏడాదితో పోలిస్తే ఈ సారి తక్కువగానే శబ్దాలు వెలువడినట్టేనని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు కాలుష్యంపై సృ్పహ పెరిగిందని పీసీబీ అధికారులు చెబుతుండగా, మరికొందరు ధరల పెరుగుదల నేపథ్యంలో తక్కువ కొనుగోళ్లు జరిగాయంటున్నారు. గత ఏడాది లాగే వాతావరణంలో పరిస్థితులు ఉంటే తప్పకుండా తక్కువ ప్రమాణాలు నమోదై ఉండేవని అంటున్నారు.