అవయవదానంపై పెరుగుతున్న అవగాహన
మరణించి ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపిన వర్ధమాన సినీ నటుడు శ్రీనివాస్
పంజగుట్ట: అవయవదానంపై రోజురోజుకీ అవగాహన పెరుగుతున్నది. ఇటీవలే ఓ పోలీస్ ఉద్యోగిని అవయవదానం చేయగా తాజాగా ఓ వర్ధమాన సినీ నటుడు అవయవ దానం చేశారు. నిమ్స్ జీవన్‌దాన్ విభాగం ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా కొండాపూర్‌లో నివాసం ఉండే డి.శ్రీనివాసులు(26) పలు సినిమాల్లో నటించాడు. రక్తచరిత్ర, క్షేత్రం, లౌలీ లాంటి 6 సినిమాల్లో, 6 షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు.
పోలీస్‌డైరీ లాంటి సీరియల్స్‌లో కూడా నటించాడు. ఇతనికి నెలరోజుల క్రితమే నాగమణితో వివాహమయ్యింది. శ్రీనివాసులు గత నెల 30న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పరిగి వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఇతని తలకు బలమైన గాయం కావడంతో వెంటనే అతన్ని స్థానికంగా ఉండే ఎస్‌వీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకొవచ్చారు. ఈ నెల 1వ తేదీన శ్రీనివాస్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. కిమ్స్ జీవన్‌దాన్ కో ఆర్డినేటర్ అశోక్‌రెడ్డి... శ్రీనివాస్ భార్య నాగమణికి అవయవదానంపై అవగాహన కల్పించారు. అవయవదానానికి ఒప్పుకోవడంతో శ్రీనివాస్‌కు శస్త్రచికిత్స నిర్వహించి రెండు కిడ్నీలు, లివర్, రెండు హార్ట్‌వాల్వ్స్‌తోపాటు మొత్తం ఐదు అవయవాలు తీసుకుని అవసరమైన వారికి అమర్చారు.