Aspiring actor
-
నటిపై అత్యాచారం కేసులో దర్శకుడికి ఊరట!
ముంబై : వర్థమాన నటిపై లైంగిక దాడి కేసులో భోజ్‌పురి సినీ దర్శకుడికి ఊరట లభించింది. ముంబై సెషన్ కోర్టు తాజాగా అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడైన రాంకుమార్ కుమావత్ (51)పై ఓ వర్ధమాన నటి లైంగిక దాడి కేసు నమోదు చేసింది. సినిమాల్లో అవకాశమిస్తానని తన కార్యాలయానికి పిలిచిన రాంకుమార్.. అక్కడ తనపై లైంగిక దాడి చేశాడని నటి ఆరోపించింది. అయితే, వారిద్దరూ పరస్పర సమ్మతితోనే శృంగారంలో పాల్గొన్నారని, సినిమాలో అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆమె కేసు నమోదు చేశారని వాదనల సందర్భంగా డిఫెన్స్ లాయర్ నిరూపించారు. ప్రాసిక్యూషన్ కేసు ప్రకారం.. 2009 జూలై 21న తన సినిమాలో ‘ఐటెం గర్ల్’ అవకాశం ఇస్తానంటూ నటిని కుమావత్ తన కార్యాలయానికి పిలిచి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మరునాడు డ్యాన్స్ రిహార్సల్ పేరిట మరోసారి పిలిచి.. ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడు. కానీ చివరకు ఆ అవకాశం వేరే అమ్మాయికి ఇచ్చాడు. దీంతో నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాల్లో అవకాశం దొరుకుతుందన్న ఆశతోనే తాను కుమావత్ ఇంటికి వెళ్లానని, తనకు అవకాశం దొరికి ఉంటే కేసు నమోదుచేసేదాణ్ని కాదని డిఫెన్స్ లాయర్ల క్రాస్‌ఎగ్జామినేషన్‌లో నటి తెలిపింది. బాధితురాలి శరీరం మీద ఉన్న గాయాలు కల్పితమైనవేనని వైద్యులు తమ నివేదికలో తేల్చారు. అంతేకాకుండా ఆమె వాంగ్మూలంలోనూ పలు వైరుధ్యాలు ఉండటంతో కోర్టు డైరెక్టర్ కుమావత్‌ను నిర్దోషిగా తేల్చింది. -
అవయవదానంపై పెరుగుతున్న అవగాహన
మరణించి ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపిన వర్ధమాన సినీ నటుడు శ్రీనివాస్ పంజగుట్ట: అవయవదానంపై రోజురోజుకీ అవగాహన పెరుగుతున్నది. ఇటీవలే ఓ పోలీస్ ఉద్యోగిని అవయవదానం చేయగా తాజాగా ఓ వర్ధమాన సినీ నటుడు అవయవ దానం చేశారు. నిమ్స్ జీవన్‌దాన్ విభాగం ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా కొండాపూర్‌లో నివాసం ఉండే డి.శ్రీనివాసులు(26) పలు సినిమాల్లో నటించాడు. రక్తచరిత్ర, క్షేత్రం, లౌలీ లాంటి 6 సినిమాల్లో, 6 షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. పోలీస్‌డైరీ లాంటి సీరియల్స్‌లో కూడా నటించాడు. ఇతనికి నెలరోజుల క్రితమే నాగమణితో వివాహమయ్యింది. శ్రీనివాసులు గత నెల 30న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పరిగి వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఇతని తలకు బలమైన గాయం కావడంతో వెంటనే అతన్ని స్థానికంగా ఉండే ఎస్వీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకొవచ్చారు. ఈ నెల 1వ తేదీన శ్రీనివాస్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. కిమ్స్ జీవన్‌దాన్ కో ఆర్డినేటర్ అశోక్‌రెడ్డి... శ్రీనివాస్ భార్య నాగమణికి అవయవదానంపై అవగాహన కల్పించారు. అవయవదానానికి ఒప్పుకోవడంతో శ్రీనివాస్‌కు శస్త్రచికిత్స నిర్వహించి రెండు కిడ్నీలు, లివర్, రెండు హార్ట్వాల్వ్స్తోపాటు మొత్తం ఐదు అవయవాలు తీసుకుని అవసరమైన వారికి అమర్చారు.