
ప్రతీకాత్మక చిత్రం
ముంబై : వర్థమాన నటిపై లైంగిక దాడి కేసులో భోజ్‌పురి సినీ దర్శకుడికి ఊరట లభించింది. ముంబై సెషన్ కోర్టు తాజాగా అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడైన రాంకుమార్ కుమావత్ (51)పై ఓ వర్ధమాన నటి లైంగిక దాడి కేసు నమోదు చేసింది. సినిమాల్లో అవకాశమిస్తానని తన కార్యాలయానికి పిలిచిన రాంకుమార్.. అక్కడ తనపై లైంగిక దాడి చేశాడని నటి ఆరోపించింది.
అయితే, వారిద్దరూ పరస్పర సమ్మతితోనే శృంగారంలో పాల్గొన్నారని, సినిమాలో అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆమె కేసు నమోదు చేశారని వాదనల సందర్భంగా డిఫెన్స్ లాయర్ నిరూపించారు. ప్రాసిక్యూషన్ కేసు ప్రకారం.. 2009 జూలై 21న తన సినిమాలో ‘ఐటెం గర్ల్’ అవకాశం ఇస్తానంటూ నటిని కుమావత్ తన కార్యాలయానికి పిలిచి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మరునాడు డ్యాన్స్ రిహార్సల్ పేరిట మరోసారి పిలిచి.. ఆమెపై మళ్లీ అత్యాచారం చేశాడు. కానీ చివరకు ఆ అవకాశం వేరే అమ్మాయికి ఇచ్చాడు. దీంతో నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాల్లో అవకాశం దొరుకుతుందన్న ఆశతోనే తాను కుమావత్ ఇంటికి వెళ్లానని, తనకు అవకాశం దొరికి ఉంటే కేసు నమోదుచేసేదాణ్ని కాదని డిఫెన్స్ లాయర్ల క్రాస్‌ఎగ్జామినేషన్‌లో నటి తెలిపింది. బాధితురాలి శరీరం మీద ఉన్న గాయాలు కల్పితమైనవేనని వైద్యులు తమ నివేదికలో తేల్చారు. అంతేకాకుండా ఆమె వాంగ్మూలంలోనూ పలు వైరుధ్యాలు ఉండటంతో కోర్టు డైరెక్టర్ కుమావత్‌ను నిర్దోషిగా తేల్చింది.