
నటిపై అత్యాచారం, 36 లక్షలు స్వాహా
ముంబై: సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి వంచించడమే కాకుండా భారీ మొత్తంలో డబ్బులు స్వాహాచేసిన ఓ దర్శకుడి వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినిమా అవకాశాల పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పాకిస్థాన్‌కు చెందిన ఓ నటి (30) ఆరోపించింది. తన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించమంటే బెదిరిస్తున్నారని భోజ్పురి దర్శకుడు శ్యామ్ చరణ్ యాదవ్(42) మరోఇద్దరు సహదర్శకులు బబ్లూ , టైగర్ లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మూడేళ్ల క్రితం ఓ సినిమా ఫంక్షన్ లో పరిచయమైన పాకిస్తానీ నటిని దర్శకుడు శ్యామ్ మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని మభ్యపెట్టాడు. పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేశాడు. సినిమా నిర్మాణానికి ఆమెనుంచి రూ. 35.80 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అటు సినిమా ఛాన్సులు లేక, ఇటు తీసుకున్న డబ్బులు చెల్లించక ముఖం చాటేస్తున్న దర్శకుడిని ఆమె గట్టిగా నిలదీయడంతో బబ్లూ , టైగర్ లతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దర్శకుడు తనను మోసంచేశాడని ఆమె ఆరోపిస్తోంది. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని నిందితుడి అరెస్ట్ చేశామని డీఎస్పీ బావ్చే తెలిపారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని, విచారణ కొనసాగుతుందన్నారు.