గురువారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో ఆందోళన చేస్తున్న ప్రయాణికులు
శంషాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో బోర్డింగ్ చేసుకున్న ప్రయాణికులకు కూడా ప్రయాణించే అవకాశం లేకుండా పోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే ఎయిర్‌లైన్స్ విమానాల్లో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం అర్ధరాత్రి, శుక్రవారం ఉదయం కూడా బోర్డింగ్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు విమానంలోకి ఎక్కకుండానే టేకాఫ్ తీసుకున్న సంఘటనలు జరిగాయి.
గురువారం రాత్రి 10.28 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి వయా బెంగళూరు మీదుగా ఢిల్లీ వెళ్లాల్సిన 6 ఈ 511 విమానంలో బోర్డింగ్ పూర్తి చేసుకున్న 25 మంది ప్రయాణికులు వెళ్లాల్సి ఉన్నా వారు ఎక్కకుండానే విమానం సమయానికి టేకాఫ్ తీసుకుంది. దీంతో ప్రయాణికులు రాత్రి ఒంటిగంట వరకు ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు కాచారు. తాము సమయానికి బోర్డింగ్ పూర్తి చేసుకున్నా విమానంలోకి ఎక్కకుండా గేట్ మూసివేశారని ఆరోపించారు. ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరిన విమానంలో కూడా సుమారు 20 మంది ప్రయాణికులు బోర్డింగ్ పూర్తి చేసుకున్న తర్వాత విమానంలోకి ఎక్కకుండానే టేకాఫ్ తీసుకుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గత ఏప్రిల్‌లో శబరిమలై వెళ్లే పలువురు ప్రయాణికులు కూడా సుమారు రెండు రోజుల పాటు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు.