దీక్ష విరమణ ప్రసక్తే లేదు
- కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టీకరణ
- ఐదో రోజుకు చేరిన ఆమరణ దీక్ష
సాక్షిప్రతినిధి, కాకినాడ/హైదరాబాద్: కాపులకు బీసీ జాబితాలో చేరుస్తామన్న హామీని ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్ష సోమవారం ఐదో రోజుకు చేరింది. ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని, హామీలను నెరవేర్చే వరకూ దీక్ష విరమించేది లేదని ఆయన తాజాగా తేల్చిచెప్పినట్లు సమాచారం. మరోవైపు ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవడం పట్ల కాపులు మండిపడుతున్నారు. ముద్రగడ ఆరోగ్యం విషమిస్తోందనే విషయం తెలియడంతో ఆందోళనకు గురైన అమలాపురానికి చెందిన సాధనాల బాలాజీ(30) గుండెపోటుతో మృతిచెందాడు.
హెల్త్ బులెటిన్లలో గందరగోళం: ముద్రగడను కిర్లంపూడి నుంచి రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువచ్చిన దగ్గర నుంచి వైద్యులు రోజుకో రకమైన హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. ఆదివారం వరకు ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని చెబుతూ వచ్చిన వైద్యులు సోమవారం నిలకడగా ఉందని వెల్లడించారు. ముద్రగడ లేచి తిరుగుతున్నారని, చాలా హుషారుగా ఉన్నారని సోమవారం హెల్త్ బులెటిన్‌లో ప్రకటించారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకోకుండా, ఎలాంటి వైద్యం పొందకుండా దీక్ష చేస్తున్న ముద్రగడ ఆరోగ్యం ఒకరోజు ఆందోళనకరంగా, మరుసటి రోజు నిలకడగా ఎలా ఉంటుందని కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు.
చర్చల ప్రసక్తే లేదు: ప్రభుత్వంతో చర్చలకు ముద్రగడ సానుకూలంగా ఉన్నారంటూ పత్రికల్లో (‘సాక్షి’లో కాదు) వచ్చిన వార్తలను ఆయన పెద్ద కుమారుడు బాలు ఖండించారు. తన తండ్రి నుంచి చర్చల ప్రస్తావన రాలేదని తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరూ దీక్ష విరమించే ప్రసక్తే లేదని తన తండ్రి తేల్చి చెప్పారని వివరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం ముద్రగడ పద్మనాభం అరెస్టు విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరించిందని న్యాయవాదులు, కాపు సద్భావన సంఘం నేతలు కె.రామజోగేశ్వర్‌రావు, సాయికుమార్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చేరుకున్న వారు ఏపీ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. దీన్ని స్వీకరించిన హెచ్చార్సీ కేసు పరిశీలనకు మంగళవారానికి వాయిదా వేసింది.
ముద్రగడ అరెస్టుపై కాపుల ఆందోళన: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అరెస్టును నిరసిస్తూ సోమవారం పలు జిల్లాల్లో కాపులు ఆందోళన చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బైఠాయించారు. అధికారులకు వినపత్రాలు సమర్పించారు. ముద్రగడ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.