ముమ్మరంగా సోదాలు
నయీమ్ బంధువులు, అనుచరుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు
భారీగా నగదు, భూ పత్రాలు, ఆయుధాలు లభ్యం!
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బంధువులు, అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. ఎల్‌బీనగర్ పరిధిలోని హస్తినాపురం, కుంట్లూర్‌తోపాటు నయీమ్ నివాసమున్న అల్కాపూర్ టౌన్‌షిప్‌లో మళ్లీ తనిఖీలు చేశారు. హస్తినాపురం ద్వారకానగర్‌లో నయీమ్ బంధువుల ఇంటి పై బుధవారం వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఎనిమిదేళ్ల క్రితం నయీమ్ ద్వారకానగర్‌లో బండ జైపాల్‌రెడ్డి ఇంటిని కొనుగోలు చేసి అందులో నజియాబేగంను ఉంచాడు. ఆ తర్వాత నయీమ్ అనుచరులు సుధాకర్‌చారి, నవీన్‌లు ఈ ఇంటిని సెటిల్‌మెంట్లకు అడ్డాగా మార్చారు. పోలీసులు ఈ ఇంటికి వెళ్లినపుడు తాళం వేసి ఉండటంతో పగులగొట్టి తనిఖీలు చేపట్టారు. నగదు, పత్రాలు, ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
సోదరుడి ఇంటిపై దాడులు
నయీమ్ పెద్దమ్మ కొడుకు సలీం గత ఆర్నె ల్లుగా పెద్దఅంబర్‌పేట పరిధిలోని కుంట్లూరు తెలంగాణనగర్‌లో నివాసం ఉంటున్నాడు. పోలీసులు బుధవారం ఆ ఇంటిపై దాడి చేసి సలీంతోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇంటి నుంచి కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక అల్కాపురిలోని నయీమ్ ఇంటి ని నార్సింగి పోలీసులు, రెవెన్యూ అధికారులు మరోసారి తనిఖీ చేశారు. ఒక బెడ్‌రూమ్‌ను తనిఖీ చేసేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. బుధవారం ఉదయం 10.30కి రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, నార్సింగ్ సీఐ రామ్‌చందర్‌రావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మరోసారి నయీమ్ ఇంట్లో సోదాలు జరిపారు. డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్ బుక్‌లు లభించినట్లు తెలిసింది. నయీమ్ కేసుల వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ ఇన్‌చార్జి నాగిరెడ్డి బుధవారం సాయంత్రం అల్కా పురిలోని నయీమ్ ఇంటికి వచ్చి పోలీసుల నుంచి సోదాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, పోలీసుల ఇంటి నుంచి స్వాధీ నం చేసుకున్న నగదు, బంగారు అభరణాలు, పత్రాలను పోలీసులు గురువారం ఉప్పర్‌పల్లి కోర్టుకు అందజేసి, అనంతరం బ్యాంక్‌లో డిపాజిట్ చేయనున్నారు.
పోలీస్ కస్టడీలో ఫర్హానా, ఆసియాలు
నార్సింగి పోలీసులు ఫర్హానా, ఆసియాలను బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కస్టడీకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మూడు రోజులపాటు వీరిని విచారించనున్నట్లు తెలుస్తోంది. రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్ళి నయీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వీరి నుంచి రాబడుతున్నట్టు సమాచారం.