కాలేజీ హాస్టళ్లలో గదికి ఇద్దరే! | Inter Board prepared rules to hostels | Sakshi
Sakshi News home page

కాలేజీ హాస్టళ్లలో గదికి ఇద్దరే!

Published Tue, Mar 20 2018 1:49 AM | Last Updated on Tue, Mar 20 2018 1:49 AM

 Inter Board prepared rules to hostels - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల ఇష్టారాజ్య వైఖరికి ఇక చెక్‌ పడనుంది. ఒక్కో గదిలో పదిమంది వరకు విద్యార్థులను కుక్కిపడేసే కాలేజీ హాస్టళ్ల తీరుపై ఇంటర్‌ బోర్డు దృష్టి సారించింది. రెసిడెన్షియల్‌ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసినా తగిన సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బందులపాలు చేసే యాజమాన్యాలపై కొరడా ఝళిపించనుంది. ఇందుకోసం పక్కా నిబంధనలను సిద్ధం చేసింది ఇంటర్మీడియెట్‌ బోర్డు. జూనియర్‌ కాలేజీలు, హాస్టళ్లలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు, ఒత్తిడిని దూరం చేసేందుకు త్వరలోనే మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో..
అరకొర వసతులు కలిగిన హాస్టళ్లలో ఉదయం 5 గంటలకు నిద్ర లేచింది మొదలుకొని అర్ధరాత్రి 12 గంటల వరకు చదువులతో ఒత్తిడికి లోనవుతున్న విద్యార్థులు ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు గత నవంబరు, డిసెంబరు నెలల్లో హాస్టళ్లలో పరిస్థితులపై తనిఖీలు నిర్వహించింది.

వసతుల లేమితో హాస్టళ్లలో ఉండలేక, ఇంటికి వెళ్లలేక, సరైన నిద్రలేక, చదువే లోకంగా ఉంటున్న విద్యార్థులు.. ఆ ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితు లున్నాయని తెలుసుకుంది. వాటిని మార్చేందుకు ఇన్నాళ్లు బోర్డు పరిధిలో లేని కాలేజీ హాస్టళ్లను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తమ పరిధిలోకి తెచ్చుకుంది. వాటి ని నియంత్రించేందుకు నిబంధనలను సిద్ధం చేసింది. ముఖ్యంగా కాలేజీ హాస్టళ్లలోని విద్యార్థులకు తగిన సదుపాయాలు కల్పించడంతోపాటు ఒత్తిడిని దూరం చేసే మార్గదర్శకాలను సిద్ధం చేసింది.

ఇవీ ప్రధాన నిబంధనలు..
హాస్టల్‌లోని గదిలో ఇద్దరు విద్యార్థులను మాత్రమే ఉంచాలి.  
 బాలురైతే ప్రతి 8 మందికి ఒక బాత్‌రూమ్‌ ఉండాలి. బాలికలైతే ప్రతి ఆరుగురికి ఒక బాత్‌రూమ్‌ ఉండాలి.  
ప్రతి విద్యార్థికి 50 చదరపు అడుగుల ప్రదేశం ఉండేలా చూడాలి.  
 360 మంది విద్యార్థులను ఒక యూనిట్‌గా తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మరో యూనిట్‌ ఏర్పాటు చేయాలి.
 ప్రతి యూనిట్‌కు వంట చేసే సిబ్బంది ఆరుగురు ఉండాలి. పరిశుభ్రత కోసం తగిన సిబ్బందిని నియమించాలి. దానిని స్థానిక మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో కమిటీ పర్యవేక్షించాలి.
భోజనం నాణ్యతపై ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో కమిటీ నిరంతరం పర్యవేక్షించాలి.  
ప్రతి నెలా కచ్చితంగా పేరెంట్, టీచర్‌ మీటింగ్‌ ఉండాలి. సెలవు దినాల్లో విద్యార్థులను కలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు కల్పించాలి.  
క్వాలిఫైడ్‌ కౌన్సెలర్లను అందుబాటులో ఉంచాలి. ఒత్తిడితో ఇబ్బంది పడే విద్యార్థులకు తగు సలహాలు అందజేయాలి.
 విద్యార్థులను ఉదయం 6 గంటల లోపు నిద్ర లేపకూడదు. రాత్రి 10 గంటల తరువాత స్టడీ అవర్స్‌ కొనసాగించవద్దు.  
ఈ నిబంధనలను అతిక్రమిస్తే యాజమాన్యాల గుర్తింపును రద్దు చేసే అవకాశం ఉంది.  
ఈ నిబంధనలు ప్రైవేటు రెసిడెన్షియల్‌ కాలేజీలకే కాదు.. ప్రభుత్వ కాలేజీలకు (ఫీజులు మినహా) వర్తిస్తాయి.  

ముందుగానే దరఖాస్తుల ఆహ్వానం..
జూనియర్‌ కాలేజీలకు అనుబంధ గుర్తింపు, హాస్టళ్లకు గుర్తింపు ఇచ్చేందుకు నిబంధనల జారీ కంటే ముందుగానే ఆయా యాజమాన్యాల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. 2018–19 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్‌ కోర్సును నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,667 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్మీడియెట్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అందులో 700 వరకు హాస్టళ్లు కలిగిన కాలేజీలు ఉన్నట్లు బోర్డు అంచనా.

కానీ ఇంతవరకు 267 కాలేజీలు మాత్రమే హాస్టళ్లకు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. మిగతా కాలేజీలు ఇంకా ముందుకు రాలేదు. గత నెల 22 తోనే దరఖాస్తుల గడువు ముగిసినా కాలేజీల విజ్ఞప్తి మేరకు ఈ నెల 20వ తేదీ వరకు గడువును ఇంటర్‌ బోర్డు పొడిగించింది. అయినా ఇంతవరకు ఇంకా 400కు పైగా హాస్టళ్లు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేదు. మరి వాటిపై బోర్డు ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే. ఇక కాలేజీల గుర్తింపు ఫీజును గతంలోనే ఖరారు చేసిన బోర్డు.. ఇపుడు హాస్టళ్లు కలిగిన కాలేజీలకు మొత్తంగా రూ.ఆరు లక్షలు గుర్తింపు ఫీజుగా ఖరారు చేసినట్లు తెలిసింది. వాటిపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement