అన్యాయాన్ని ప్రశ్నించినందుకు వర్సిటీ నుంచి బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) యాజమాన్యం గురువారం ఇద్దరు విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించింది. ఎంఏ ఇంగ్లిష్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకుగానూ ఈ ఇద్దరు విద్యార్థులను వర్సిటీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇఫ్లూలో ఎంఏ ఇంగ్లిష్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ని ఆన్‌లైన్‌లో నిర్వహించారు. గతంలో క్యాంపస్‌లోనే ఈ పరీక్షల నిర్వహణ జరిగేది.
కానీ ఈసారి నగరంలోని కొన్ని ప్రైవేటు కంప్యూటర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించారు. పరీక్ష హాలుకి అరగంట ముందు వస్తే చాలని ప్రకటించిన యాజమాన్యం తీరా విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందు చేరుకున్నా పరీక్షకి అనుమతించలేదు. దీంతో 70 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవకుండానే తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఆన్‌లైన్ పరీక్షా కేంద్రానికి సమయానికే వచ్చినా పరీక్ష రాయలేకపోయామని నాచారంలోని పరీక్ష కేంద్రం నుం చి తిరిగి వెళ్లిపోయిన నాగేంద్ర, రవికుమార్ అనే విద్యార్థులు ‘సాక్షి’కి తెలిపారు.
విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించకపోవడంపై ఇఫ్లూ ప్రొక్టర్ కోనా ప్రకాశ్‌రెడ్డిని విద్యార్థి నాయకులు ప్రశ్నించారు. విద్యార్థులు ప్రశ్నించడమే నేరంగా భావించిన ఇఫ్లూ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు కేరళ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విద్యార్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేశారు. అయితే ఈ విద్యార్థులను వర్సిటీలోనికి మాత్రం అనుమతించలేదు. సెక్యూరి టీసిబ్బంది వారిని వర్సిటీ గేటువద్దే అడ్డుకున్నారు.
ఇఫ్లూలో ఇద్దరు విద్యార్థుల అరెస్టు
Published Fri, May 6 2016 2:11 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement