
మారువేషంలో ట్రైనీ ఐపీఎస్‌లు!
సైబరాబాద్ పోలీసుల పనితీరుపై ఆరా
సిటీబ్యూరో: శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమి (ఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న యువ ఐపీఎస్‌లు మారు వేషంలో సైబరాబాద్ పోలీసుల పనితీరుపై ఆరా తీశారు. సాధారణ పౌరుల వేషంలో వారు ఆయా పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ‘‘బస్సు దిగుతుండగా పర్సు పోయింది’’, ‘‘బస్టాప్‌లో నిలబడితే జేబులోంచి సెల్‌ఫోన్ దుండగులు లాక్కెళ్లారు’’. ‘‘బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తుండగా దుండగులు లాక్కొనిపోయారు’’ ఇలా రకరకాల ఫిర్యాదులో వారు స్టేషన్‌కు వచ్చి అధికారులను కలిశారు.
ఆ సందర్భంగా పోలీసులు స్పందించిన తీరును జాగ్రత్తగా పరిశీలించారు. కొంత మంది ఎస్‌ఐలు ఫిర్యాదును పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, మరికొంత మంది ఎస్‌ఐలు వచ్చిన వెంటనే మర్యాదపూర్వకంగా స్వాగతం పలకడం, ఇచ్చిన ఫిర్యాదును ఒపిగ్గా చదివి మరిన్ని వివరాలు తెలుసునే ప్రయత్నం చేయడం, కేసు నమోదు చేస్తామనడం లాంటివి మారువేషంలో వచ్చిన ట్రైనీ ఐపీఎస్‌లు గమనించారు.
సైబరాబాద్ పోలీసు అధికారుల పనితీరు 74 శాతం బాగుందని, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయని వారి శాతం 14 ఉందని, అసలు ఫిర్యాదు చదివే ఒపిక లేక ఏదో ఒకటి చెప్పి వెనక్కి పంపించిన వారి శాతం 12 ఉందని వారు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు తెలిపారు. శిక్షణలో భాగంగానే ట్రైనీ ఐపీఎస్‌లు ఇలా వచ్చి పోలీసుల తీరుతెన్నులను పరిశీలించారు. ఈ విషయాన్ని సీవీ ఆనంద్ శుక్రవారం జరిగిన సెట్ కాన్ఫరెన్స్‌లో వివరించారు. స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలు, ఇతర అధికారులకు ఆయన ఈ కింద సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
*సర్టిఫికెట్లు, సెల్‌ఫోన్ పోగుట్టుకుని ఎవరైనా పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే వారికి వెంటనే మిస్సింగ్ సర్టిఫికెట్ ఇవ్వాలి.
*ప్రతి ఠాణా పనితీరుపై నిఘా పెట్టాం. అధికారులు, సిబ్బంది పనితీరుపై స్పెషల్ బ్రాంచ్, ఇతర అధికారులతో నివేదికలు తెప్పించుకుంటున్నాం.
*స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఠాణాకు వస్తే వారికి అక్కడి సిబ్బంది, అధికారులు సహకరించడంలేదని తెలిసింది. ఇకపై స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సహకరించి, సమాధానాలు చెప్పండి.
*ఠాణాలలో నిందితులను విచారించే సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదు. శంషాబాద్ జోన్‌లోని ఓ స్టేషన్‌లో ఇటీవల థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఇకపై ఇలా జరకుండా చూడండి. ఎస్‌ఐ నుంచి ఆ పై స్థాయి అధికారులందరూ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించాలి. ప్రజలను నుంచి వచ్చే ఫిర్యాదులను వాట్స్‌యాప్ ద్వారా పంపించే విధానం ప్రారంభమైంది.