►ప్రస్తుతం వెలుగు చూస్తున్న కొత్త తరహా మోసాలు, సరిహద్దులు దాటి విస్తరించి, పోలీసుశాఖకు సవాళ్లు విసురుతున్న సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల దర్యాప్తులో శాస్త్రీయ విధానాలను అవలంబించాలి.
►ఐకమత్యం, సున్నితత్వంతో విధులు నిర్వహించి పోలీసు బాధ్యతలను మరింత ప్రభావవంతంగా నిర్వహించాలి.
►జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా విధులు నిర్వహించాలి. ఈ క్రమంలో అధికారులు సాంకేతికతకు పెద్దపీట వేయాలి
సాక్షి, హైదరాబాద్: యువ ఐపీఎస్ అధికారులు సురాజ్యం కోసం కదలాలని, పోలీసు శాఖకు సవాళ్లు విసురుతున్న కొత్త తరహా నేరాలను శాస్త్రీయ కోణంలో దర్యాప్తు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సమాజంపై సానుభూతితో వ్యవహరిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడేలా, పోలీసు డిపార్ట్‌మెంట్‌పై సమాజంలో సానుకూల భావన కలిగేలా విధులు నిర్వహించా లని ఆకాంక్షించారు. యువ ఐపీఎస్ అధికారులం తా ఒకే శ్రేష్ట భారత్ అనే ప్రతిష్టాత్మక పతకాన్ని చేతబూని దేశాన్ని ముందుండి నడిపించాలని హితవు పలికారు. శనివారం హైదరాబాద్ శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న 71, 72వ బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్‌లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘రాబోయే 25 ఏళ్లలో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతాయి. ఆ సమయానికి మన దేశ పోలీసు బలగాలు ఆధునిక, దృఢమైన, సవాళ్లను ఎదుర్కొనే స్థాయికి ఎదగాలి. అమృతోత్సవ్‌లో మీరు బాధ్యతలు తీసుకుంటూ వందేళ్ల స్వాతంత్య్ర భారతంలో కీలకభూమిక పోషించాలి’అని ఆశాభావం వ్యక్తంచేశారు.
సమరయోధుల స్ఫూర్తిని గుర్తుంచుకోండి
‘గడిచిన 75 ఏళ్లలో మెరుగైన పోలీసు సేవలందించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకోండి. 1930 నుంచి 1947 మధ్యకాలంలోని యువత గొప్ప లక్ష్యాలను చేరుకుంది. వారు స్వరాజ్యం కోసం ఉద్యమించారు. నేటి యువత అయిన మీరు సురాజ్యం కోసం ముందుకు సాగాలి. జిల్లా పోలీసు అధికారిగా పరిపూర్ణ జ్ఞానం, హుందాతనంతో విధులు నిర్వహించాలి. పోలీసు డిపార్ట్‌మెంటులో మహిళా భాగస్వామ్యం పెరగాల్సిన అవసరముంది. జాతి బిడ్డలైన మీరు పోలీసు సేవల్లో అత్యున్నత ప్రమాణాలు, జవాబుదారీతీనం, గౌరవం, సున్నితత్వాన్ని పెంపొదించాలి’అని మోదీ చెప్పారు. కరోనా కాలంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ప్రధాని శ్రద్ధాంజలి ఘటించారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు.
మనమంతా ఆప్తులం.. మిత్రులం
‘ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకుని వెళ్తున్న పొరుగు, విదేశీ అధికారులు మన దేశాల మధ్య ఉన్న సంబంధాలను, సఖ్యతను దృష్టిలో ఉంచుకోవాలి. నేపాల్, భూటాన్, మాల్దీవులు, మారిషస్ ఏ దేశమైనా మనం కేవలం భౌగోళిక సాన్నిహిత్యమే కాకుండా.. ఆలోచన దృక్పథం, సామాజిక విధానాల్లో అనేక సారూప్యతలు కలిగి ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి విపత్తు, ఆపద వచ్చినా మనమంతా మిత్రులుగా, ఆప్తులుగా ఒకరికొకరం సహకరించుకుంటాం. ఇదే స్ఫూర్తిని కరోనా సమయంలోనూ కొనసాగించాం’అని ప్రధాని చెప్పారు.
మొత్తం 178 మంది
సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈసారి పాసింగ్‌ఔట్ పరేడ్‌లో పాల్గొంటున్న 71, 72వ బ్యాచ్‌ల్లో మొత్తం 178 మంది ప్రొబేషనరీ ఐపీఎస్‌లు ఉన్నారు. వీరిలో 33 మంది మహిళలు కాగా, 34 మంది విదేశీ (నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవులకు చెందిన) అధికారులు ఉన్నారు. వీరికి ఈనెల 6న పాసింగ్ ఔట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment