సాగు లక్ష్యాలపై ‘జల’ మథనం!
సాగునీటి ప్రాజెక్టు అధికారులతో రేపు నీటిపారుదల శాఖ సమావేశం
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల వ్యవస్థలను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయడం, నీటి వినియోగ సామర్థ్యం మెరుగపర్చడం, ఆయకట్టు లక్ష్యాలను అనుకున్న సమయానికి వృద్ధిలోకి తేవడం లక్ష్యంగా వచ్చే ఏడాదికి కార్యాచరణ సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణరుుంచింది. ఈ మేరకు ఈ నెల 6న నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించనుంది. ఒక్కో ప్రాజెక్టు కింద నెలవారీగా చేయాల్సిన పనులు, అవసరమైన బడ్జెట్, వివిధ శాఖలతో సమన్వయం, ఆయకట్టు లక్ష్యాలు తదితరాలపై చర్చించనున్నారు. నెలవారీ ప్రణాళికతో రావాలని చీఫ్ ఇంజనీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది.
రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన పరీవాహకానికి నీరు పారించేందుకు రూ.1.38లక్షల కోట్లతో 36 భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. వీటి ద్వారా 67.53లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణరుుంచారు. ఈ ప్రాజెక్టుల్లో ఇప్పటికే మూడు ప్రాజెక్టులు పూర్తికాగా, మరో 14 ప్రాజెక్టుల్లో పాక్షికంగా ఆయకట్టు వృద్ధిలోకి వచ్చింది. 2016-17కు గానూ రాష్ట్రంలోని 8 ప్రాజెక్టులు పూర్తిగా, 11 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తి చేసి, వీటి ద్వారా మొత్తం 7,32,264 ఎకరాలకు నీరందించాలని లక్ష్యంగా నిర్ణరుుంచింది. ఇందులో ప్రధానంగా ఎల్లంపల్లి కింద 60వేలు, ఎస్సారెస్పీ-2 కింద 20వేలు, నెట్టెంపాడు కింద 1.47లక్షలు, భీమా కింద 1.25లక్షలు, కల్వకుర్తి కింద లక్ష, దేవాదుల కింద 80వేల ఎకరాలకు నీరివ్వాలని లక్ష్యంగా నిర్ణరుుంచారు. మొత్తం ఆయకట్టు లక్ష్యం 67.53లక్షల ఎకరాలతో చూస్తే మరో 56.58 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాది పూర్తికాని లక్ష్యం 5లక్షల ఎకరాలతో పాటు, వచ్చే ఏడాదికి ముందుగానే నిర్ణరుుంచిన లక్ష్యం మరో 5.55లక్షల ఎకరాలు కలిపి 10.55లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాల్సి ఉంది.