ప్రజెంటేషన్ ఎక్కడ, ఎలా?
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులపై ఇవ్వనున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతలు గురువారం సమావేశమై దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా, సీఎం కేసీఆర్ శాసనసభలో ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు సాంకేతికంగా, రాజకీయంగా దీటుగా బదులిచ్చేలా సమగ్ర నివేదికను రూపొందించడంపై మల్లగుల్లాలు పడ్డారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, నేతలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మధు యాష్కీ, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, దాసోజు శ్రవణ్, ప్రాణహిత సాధన ఉద్యమ కమిటీ నేత నైనాల గోవర్ధన్ తదితరులు భేటీలో పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రజెంటేషన్‌లోని అవాస్తవాలు, అశాస్త్రీయత, ఆయా నిర్ణయాల్లో దాగున్న అవినీతి, కాంగ్రెస్‌పై వేసిన నిందలు, ప్రాజెక్టులపై పార్టీ దూరదృష్టి, చేసిన అభివృద్ధి తదితరాలను అంకెలు, రుజువులతో సాధికారికంగా చెప్పేలా ముందుగా పక్కాగా నివేదికను రూపొందిం చాలని సీనియర్లు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతే పీసీసీ ముఖ్య నేతలు, నీటి పారుదల శాఖ మాజీ మంత్రులు, సాంకేతిక నిపుణులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చింది. నివేదిక రూపకల్పన, ప్రజెంటేషన్ తేదీ, వేదిక తదితరాలను నిర్ణయించడానికి మరిన్నిసార్లు భేటీ కావాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ నెల 14 గానీ, ఆ తర్వాత గానీ పీసీసీ ప్రజెంటేషన్ ఉంటుం దని సమాచారం.
కేసీఆర్ అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఎక్కువ ప్రాచుర్యం వచ్చిం ది గనుక అందుకు దీటుగా హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానాన్ని ఎంచుకుంటే మేల న్న ప్రతిపాదన పట్ల సానుకూలత వ్యక్తమైం ది. దీన్ని పార్టీ కార్యకర్తలంతా చూసేందుకు వీలుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల్లోనూ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కేసీఆర్ మోసాలను ప్రజలకు చెబుదాం
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌పై సీఎం నిందలను సాధికారికంగా తిప్పికొట్టేలా ప్రజెంటేషన్ ఉండాలని భేటీలో సీనియర్లు అభిప్రాయపడ్డారు. ‘‘కోటి ఎకరాలకు నీరిస్తానంటూ కేసీఆర్ ఇప్పుడు పడికట్టు పదాలతో మాయమాటలు చెబుతూ పచ్చి మోసం చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నాటికే తెలంగాణలో భారీ, మధ్య, చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 30 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులో ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం కింద 60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడానికి ప్రతిపాదించాం. వాటిలో చాలావరకు పనులు పూర్తయ్యాయి.
కొన్ని చివరి దశలో ఉన్నాయి. అవి కూడా పూర్తయితే తెలంగాణలో 98 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. మరి అలాంటప్పుడు ఇంకా కొత్తగా కోటి ఎకరాలెక్కడున్నాయి? వాటికి నీరెక్కడి నుంచి తెస్తారు? పాలమూరు పథకం కూడా 10 లక్షల ఎకరాలతో కాంగ్రెస్ హయాంలో రూపుదిద్దుకున్నదే. కేసీఆర్ మాత్రం తాను గద్దెనెక్కాక ఒక్క ఎకరం కూడా అదనంగా సాగులోకి తేలేదు. పాలనా అనుమతులతోనే సరిపెట్టారు. వీటన్నింటినీ తేదీలు, అంకెలు, జీవోల కాపీలతో సహా ప్రజల ముందుంచుదాం’’ అని నేతలు సూచించారు. ప్రాణహిత విషయంలోనూ ఏదో చేసినట్టుగా కేసీఆర్ భ్రమ కల్పిస్తున్నారన్నారు.
గోదావరి, కృష్ణాలపై రిజర్వాయర్లను పెంచడం, రీ డిజైన్లు చేయడం వెనక రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలున్నాయని కూడా ప్రజలకు అర్థమయ్యేలా వివరించేలా నివేదిక ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ‘‘టీఆర్‌ఎస్ హయాంలో ప్రాజెక్టుల విషయంలో చేసిందేమీ లేకపోగా రాష్ట్రానిక తీవ్ర నష్టం చేసే నిర్ణయాలు తీసుకున్నారనే విషయాన్ని సాధికారికంగా చెప్పగలగాలి. ఆ మేరకు అనుభవజ్ఞులైన నేతలు, సాంకేతిక నిపుణులతో నివేదిక రూపొందించాలి. గోదావరి నదిపై మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం వల్ల ఆ ప్రాజెక్టులను ఆ రాష్ట్రానిఇక మనం నిర్మించి ఇస్తున్నట్టే అవుతుంది. ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యేలా మన ప్రజెంటేషన్ ఉండాలి’’ అని నేతలు సూచించారు.