సరిగ్గా రెండ్రోజుల ముందే.. | Isis affiliated terrors | Sakshi
Sakshi News home page

సరిగ్గా రెండ్రోజుల ముందే..

Published Sat, Jul 2 2016 3:43 AM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

సరిగ్గా రెండ్రోజుల ముందే.. - Sakshi

సరిగ్గా రెండ్రోజుల ముందే..

* ఐసిస్ అనుబంధ ముష్కరులు ఇలా పట్టుబడడం దేశంలో ఇదే తొలిసారి
* హబీబ్ వంటిల్లే బాంబుల ప్రయోగశాల..
* స్వాధీనం చేసుకున్నవాటితో 30 బాంబులు తయారు చేసే అవకాశం..
* పేలుడు పదార్థాల బాధ్యత ఒకరిది.. నగదు నిర్వహణ మరొకరిది..  ఫైరింగ్ శిక్షణ ఇంకొకరిది..

సాక్షి, హైదరాబాద్: బాంబులు రెడీ చేసుకున్నారు.. తుపాకులు తెచ్చుకున్నారు.. టార్గెట్లనూ ఎంచుకున్నారు.. ఇక మారణహోమం సృష్టించడమే తరువాయి.. అంతలోనే దొరికిపోయారు..! అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌కు చెందిన ఓ అనుబంధ సంస్థ ఈ స్థాయిలో దాడులకు సన్నద్ధమై దొరికిపోవడం దేశంలో ఇదే తొలిసారి అని జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.

హైదరాబాద్‌లో మూడుచోట్ల విధ్వంసానికి కుట్ర పన్నిన ఏయూటీ ముఠాకు చెందిన 11 మంది బుధవారం ఎన్‌ఐఏ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. వీరిలో ఐదుగురిని 12 రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. దీంతో వారిని తమ అధీనంలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు విచారణ నిమిత్తం శామీర్‌పేటలోని ఎన్‌ఐఏ క్యాంపు ఆఫీసుకు తరలించారు. ఈ ఉగ్రవాదుల్ని మూడు రాష్ట్రాలకు తీసుకువెళ్లి దర్యాప్తు చేయాలని అధికారులు నిర్ణయించారు.
 
భావజాల వ్యాప్తి నుంచి.. ‘దాడుల’ దాకా..
ఐసిస్ ఛాయలు నాలుగేళ్లుగా దేశంలో కనిపిస్తున్నాయి. తొలుత ఆన్‌లైన్ ద్వారా భావజాల వ్యాప్తికే పరిమితమైన ఆ ఉగ్రవాద సంస్థ.. అందుకు దేశవ్యాప్తంగా కొందరు ఏజెంట్లను నియమించుకుంది. వీరి కార్యాకలాపాలు గుర్తించిన ఏజెన్సీలు అరెస్టులు సైతం చేశాయి. ఆ తర్వాత సిరియాలో జరుగుతున్న మారణహోమంలో పాల్గొనేలా ఐసిస్ కొందరిని ఆకర్షించింది. వివిధ మార్గాల్లో ఆ దేశం వెళ్లడానికి సిద్ధమైన, వెళ్లి తిరిగొచ్చిన కొందరి ని అధికారులు పట్టుకున్నారు.

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వివిధ రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కిన ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ (జేకేహెచ్) మాడ్యూల్‌లో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉన్నారు. బుధవారం చిక్కిన ఏయూటీ మాడ్యూల్ మాత్రం పూర్తిగా స్థానికులతో ఏర్పడింది. తుపాకులు, పేలుడు పదార్థాలు సమకూర్చుకోవడం నుంచి మరో రెండ్రోజుల్లో దాడులకు సిద్ధమయ్యారు. ఇలా అన్ని సన్నాహాలు చేసుకుని చిక్కిన తొలి మాడ్యూల్ దేశంలో ఇదే!
 
ఎవరి పని వారిదే..
సిరియా నుంచి షఫీ ఆర్మర్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా ముష్కరులు పక్కాగా వ్యవహరించారు. షఫీ ఆర్మర్ నిత్యం నేరుగా ఇబ్రహీం యజ్దానీతో సంప్రదింపులు జరిపాడు. దీంతో అతడే ఈ మాడ్యూల్ చీఫ్‌గా వ్యవహరించాడు. మిగిలినవారితో సమన్వయం చేసుకుంటూ ‘బయట’ నుంచి వచ్చే నగదు, నిర్వహణ తదితర అంశాలను పర్యవేక్షించారు. తుపాకులు, తూటాలు కొనడం, వాటిని వినియోగించడం, శిక్షణ ఇవ్వడం తదితర అంశాలను ఫహద్ పర్యవేక్షించాడు.

కొన్నిసార్లు తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో ఇంటి సెల్లార్‌లోనే టార్గెట్ బోర్డులు ఏర్పాటు చేసి ఉగ్రవాదులకు తర్ఫీదు ఇచ్చాడు. పేలుడు పదార్థాల సమీకరణ, వాటిని నిల్వ చేయడం హబీబ్ బాధ్యతలు. ఐఈడీ తయారీలో సహకరించాల్సిన బాధ్యతను ఇబ్రహీం మరో సభ్యుడైన రిజ్వాన్‌కు అప్పగించాడు. ఈ మొత్తం వ్యవహారాలను ఎప్పటికప్పుడు ఇబ్రహీం పర్యవేక్షించేవాడు. దాడులు చేయాల్సిన రోజు మాత్రం అంతా కలిసే రంగంలోకి దిగాలని పథక రచన చేశారు. ఏయూటీ హైదరాబాద్ మాడ్యూల్‌ను ఆర్మర్ ‘సాబ్’ అనే మారుపేరుతో వ్యవహరించినట్టు తెలిసింది.
 
మూడు రాష్ట్రాలకు ముష్కరులు..
మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ అలియాస్ ఇబ్బు, హబీబ్ మహ్మద్ అలియాస్ సిర్, మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, అబ్దుల్ బిన్ అహ్మద్ అమౌదీ అలియాస్ ఫహద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్ లను ఎన్‌ఐఏ అధికారులు లోతుగా విచారించనున్నారు. వీరు ఆయుధాలు కొనుగోలు చేసిన మహారాష్ట్ర, నగదు సమీకరించుకున్న రాజస్థాన్‌లతోపాటు ‘టూర్’ చేసి వచ్చిన అనంతపురానికి తీసుకువెళ్లనున్నారు.

సాక్షులుగా మార్చిన ఆరుగురి సమక్షంలోనే ఈ ఉగ్రవాదుల్ని ప్రశ్నించనున్నారు. ఈ మాడ్యూల్‌కు ఇటీవల ఓ మనీ ట్రాన్స్‌ఫర్ సంస్థ ద్వారా దుబాయ్ నుంచి 4,600 దిరమ్స్ వచ్చినట్లు ఆధారాలు లభించడంతో ఆ కోణంలోనూ విచారించనున్నారు. అనంతరం వీరిని ఢిల్లీ తరలిస్తారని సమాచారం.
 
వంటింట్లోనే బాంబు ప్రయోగాలు..
వారాంతంలో హైదరాబాద్‌లో పెను విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిన ఏయూటీకి చెందిన ముష్కరులు వంటింట్లోనే బాంబు ప్రయోగాలు చేశారు. అన్ని పేలుడు పదార్థాలు సమకూర్చుకున్న ఉగ్రవాదులు.. వాటిని బండ్లగూడలో హబీబ్ మహ్మద్ అలియాస్ సిర్ ఇంట్లోని వంటగదిలో దాచిపెట్టారు. సిరియాలో ఉన్న ఉగ్రవాది ఆర్మర్... ఆన్‌లైన్, వీడియో కాలింగ్ ద్వారా బాంబుల తయారీని వివరించగా.. ఆ వంటింట్లోనే కొన్ని ప్రయోగాలు చేశారు. ఇందుకు వంట గదిలో వినియోగించే పాత్రల్నే వాడారు. బుధవారం హబీబ్‌ను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు.. అతడి ఇంటి నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

యూరియా, పంచదార, మినరల్ యాసిడ్, ఎసిటోన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, మూడు లీటర్ల పెయింట్ థిన్నర్లు అందులో ఉన్నాయి. ఒకేసారి పెద్దమొత్తంలో కొంటే ఎవరికైనా అనుమానం వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో రెండు నెల లుగా కొద్దికొద్దిగా కొనుగోలు చేస్తూ వచ్చారు. హబీబ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పదార్థాలతో 30 ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)  బాంబుల్ని తయారు చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement